ఇన్‌స్టాగ్రామ్‌ అంటేనే చిన్న చిన్న రీల్స్‌.. కానీ ఇకపై గంటన్నర నిడివి ఉన్న వీడియోలూ అందుబాటులోకి రానున్నాయి. పాడ్‌కాస్ట్‌లు, కామెడీ షోలు వంటి సుదీర్ఘ కంటెంట్‌ను నేరుగా ఇన్‌స్టాగ్రామ్‌లోనే చూసేలా మెటా కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇప్పటివరకు చిన్న వీడియోలతో యువతను ఆకట్టుకున్న ఈ ప్లాట్‌ఫామ్‌.. ఇక పూర్తి నిడివి వీడియోలపైనా దృష్టి సారిస్తోంది.

‘ఫీచర్స్‌’ పేరుతో కొత్త ఫార్మాట్‌
ఈ కొత్త వీడియో ఫార్మాట్‌కు ‘ఫీచర్స్‌’ అని పేరు పెట్టారు. దీని ద్వారా క్రియేటర్లు 90 నిమిషాల వరకు నిడివి ఉన్న వీడియోలను అడ్డంగా ఉండే తెర ఆకృతిలో అప్‌లోడ్‌ చేయవచ్చు. ప్రస్తుతం అమెరికాలో ఎంపిక చేసిన క్రియేటర్లతో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు. బ్రెజిల్‌లోనూ ఇప్పటికే ప్రయోగాలు చేశారు.

రీల్స్‌ నుంచి పూర్తి వీడియోకు..
ఈ ఫీచర్‌లో మరో ప్రత్యేకత ఉంది. క్రియేటర్లు తమ సుదీర్ఘ వీడియోలకు సంబంధించిన చిన్న రీల్స్‌ను పోస్ట్‌ చేయవచ్చు. ఆ రీల్‌ నచ్చినవారు దానిపై క్లిక్‌ చేసి పూర్తి వీడియోను చూడొచ్చు. పాడ్‌కాస్ట్‌లు, కామెడీ షోలతో పాటు ఇంటర్వ్యూలను కూడా ఇలా అందించే అవకాశం ఉంది. పూర్తి వీడియోలు ఫీడ్‌, ఎక్స్‌ప్లోర్‌ విభాగాల్లోనూ కనిపిస్తాయి.

క్రియేటర్లకు ఆదాయం సంగతేంటి?
ప్రస్తుతానికి ఈ వీడియోలపై వచ్చే ప్రకటనల ఆదాయంలో క్రియేటర్లకు వాటా ఇచ్చే విధానాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ప్రకటించలేదు. అయితే ఇప్పటికే బ్రాండ్లతో ఒప్పందాలు ఉన్నవారు వాటిని కొనసాగించవచ్చు. భవిష్యత్తులో ఆదాయ మార్గాలను విస్తరించే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ ఫీచర్‌ ఎప్పటికి అందరికీ అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.