ఏఐ చాట్‌బాట్‌ల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఈమెయిల్స్‌ రాయడం, క్లిష్టమైన అంశాలను సులభంగా అర్థం చేసుకోవడం, ప్రయాణ ప్రణాళికలు రూపొందించడం.. ఇలా ఎన్నో పనులకు వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఏఐతో మాట్లాడేటప్పుడు మన వ్యక్తిగత సమాచారాన్ని ఎంతవరకు పంచుకోవాలనే విషయంలో జాగ్రత్త అవసరం. సాధారణమైన ప్రశ్నలా కనిపించినా, అందులో మనకు సంబంధించిన కీలక వివరాలు ఉండొచ్చు. పాస్‌వర్డ్‌లు, బ్యాంకు వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని చాట్‌బాట్‌లలో నమోదు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ వెల్లడించిన వివరాల ప్రకారం, ఏఐ చాట్‌బాట్‌లలో పంచుకోకుండా ఉండాల్సిన ఐదు రకాల సమాచారం ఇవే. 

1. పాస్‌వర్డ్‌లు, లాగిన్‌ వివరాలు
ఈమెయిల్‌, సోషల్‌ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్‌ పిన్‌లు, ఓటీపీలు, ఖాతాను తిరిగి పొందేందుకు ఉపయోగించే రికవరీ కోడ్‌లను ఏఐ చాట్‌బాట్‌లలో ఎప్పుడూ నమోదు చేయకూడదు. ఖాతాలోకి లాగిన్‌ కావడంలో సమస్య ఎదురైతే, పాస్‌వర్డ్‌ చెప్పకుండానే ఆ సమస్యను వివరించి సహాయం పొందవచ్చు.

2. బ్యాంకు, చెల్లింపుల వివరాలు
బ్యాంకు ఖాతా నంబర్లు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల పూర్తి నంబర్లు, సీవీవీ వంటి సున్నితమైన ఆర్థిక వివరాలను పంచుకోవద్దు. ఏదైనా లావాదేవీ గురించి తెలుసుకోవాలన్నా, ఖర్చులను లెక్కించాలన్నా వ్యక్తిగత వివరాలను తొలగించి సమాచారం ఇవ్వాలి. అప్పుడు కూడా అవసరమైన వివరాలు మాత్రమే పంచుకోవడం మంచిది.

3. ఆధార్‌, పాస్‌పోర్టు వంటి గుర్తింపు పత్రాలు
ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి పత్రాల్లో పేరు, చిరునామా, ఫొటో, గుర్తింపు నంబర్లతో పాటు ఇతర వ్యక్తిగత వివరాలు ఉంటాయి. వీటిని అవసరం లేకుండా చాట్‌బాట్‌లకు అప్‌లోడ్‌ చేయకూడదు. ఏదైనా పత్రాన్ని విశ్లేషించాల్సి వస్తే, ముందుగా అవసరం లేని వ్యక్తిగత వివరాలను తొలగించడం మంచిది.

4. ఆఫీసు రహస్య పత్రాలు
కంపెనీల అంతర్గత నివేదికలు, ఇంకా ప్రచురించని కథనాలు, క్లయింట్ల వివరాలు, రహస్య ఈమెయిల్స్‌ను అనుమతి లేకుండా ఏఐ చాట్‌బాట్‌లలో పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల సంస్థకు సంబంధించిన సున్నితమైన సమాచారం బయటపడే ప్రమాదం ఉంటుంది. కార్యాలయ పనుల కోసం ఏఐని ఉపయోగించేటప్పుడు సంస్థ అనుమతించిన సాధనాలనే వాడాలి. సాధ్యమైనప్పుడు అసలు పేర్లు, రహస్య వివరాల స్థానంలో సాధారణ ఉదాహరణలను ఉపయోగించాలి.

5. ఇతరుల వ్యక్తిగత సమాచారం
స్నేహితుల వ్యక్తిగత సమస్యలు, సహోద్యోగుల జీతాల వివరాలు, కుటుంబ సభ్యుల వైద్య రికార్డులను వారి అనుమతి లేకుండా చాట్‌బాట్‌లలో పంచుకోవద్దు. ఒక సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలనుకున్నప్పుడు పేర్లు, ఫోన్‌ నంబర్లు, చిరునామాల వంటి గుర్తింపు వివరాలను తొలగించి సాధారణంగా వివరించవచ్చు. ఇలా చేయడం వల్ల ఇతరుల గోప్యతకు భంగం కలగకుండా అవసరమైన సలహా పొందే అవకాశం ఉంటుంది.