స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు భారీ బ్యాటరీతో మరో కొత్త ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. చైనాలో వివో వై600ను కంపెనీ విడుదల చేసింది. ఇందులో 10,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరా, 120Hz రిఫ్రెష్‌ రేట్‌ ఉన్న అమోలెడ్‌ డిస్‌ప్లే ఉన్నాయి. ఈ ఫోన్‌ అక్టోబర్‌ 30 నుంచి చైనాలో విక్రయానికి రానుంది.

చైనాలో వివో వై600 ధర 1,999 యువాన్ల (సుమారు రూ.29,000) నుంచి ప్రారంభమవుతుంది. ర్యామ్‌, స్టోరేజ్‌ వేరియంట్లను బట్టి ధర మారుతుంది. ఈ ఫోన్‌ మూడు రంగుల్లో లభించనుంది. ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. భారత్‌లో విడుదలపై కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన లేదు.

వివో వై600లో 6.83 అంగుళాల 1.5కే అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్‌ రేట్‌కు మద్దతు ఇస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300ఈ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత ఆరిజిన్‌ఓఎస్‌ 6 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అందించారు. ఈ ఫోన్‌ 6జీబీ, 8జీబీ ర్యామ్‌ వేరియంట్లలో లభిస్తుంది. స్టోరేజ్‌ ఎంపికలు 128జీబీ, 256జీబీగా ఉన్నాయి.

ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు 50 మెగాపిక్సెల్‌ కెమెరా ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్‌ కెమెరా ఉంది. 10,000 ఎంఏహెచ్‌ బ్యాటరీకి 44 వాట్ల వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం కల్పించారు. 5జీ కనెక్టివిటీ, బ్లూటూత్‌ 5.4, యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌, ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లు ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది.