ఓ టెస్లా సైబర్‌ట్రక్ డ్రైవర్ చేసిన పని ఇప్పుడు వార్తల్లో నిలిచింది. తన సరికొత్త వాహనంలో ఉన్న 'వేడ్ మోడ్' ఫీచర్‌ను పరీక్షించేందుకు, ఏకంగా ట్రక్కును ఓ చెరువులో నడిపాడు. కానీ ఆ సరదా కాస్తా అతడిని చిక్కుల్లోకి నెట్టింది. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, ఉత్తర టెక్సాస్‌లోని గ్రేప్‌వైన్ సరస్సు వద్ద సోమవారం ఓ వ్యక్తి తన సైబర్‌ట్రక్‌ను ఉద్దేశపూర్వకంగా నీటిలోకి తీసుకెళ్లాడు. అయితే, కాసేపటికే వాహనం పనిచేయడం ఆగిపోయి, లోపలికి నీరు చేరడం మొదలైంది. దీంతో డ్రైవర్, అందులోని ప్రయాణికులు వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న గ్రేప్‌వైన్ పోలీసులు, ఫైర్ డిపార్ట్‌మెంట్ వాటర్ రెస్క్యూ టీమ్ సహాయంతో ట్రక్కును బయటకు తీశారు.

అసలు 'వేడ్ మోడ్' అంటే..?
నదులు లేదా నీటి ప్రవాహాల్లో సురక్షితంగా ప్రయాణించేందుకు టెస్లా కల్పించిన ఫీచర్.. 'వేడ్ మోడ్'. అయితే, ఇది గరిష్ఠంగా 81.5 సెంటీమీటర్ల (32 అంగుళాలు) లోతు వరకు మాత్రమే సురక్షితమని కంపెనీ చెబుతోంది. నీటి వల్ల వాహనానికి ఏదైనా నష్టం జరిగితే వారెంటీ వర్తించదని కూడా టెస్లా మాన్యువల్‌లో స్పష్టంగా హెచ్చరించింది.

'వేడ్ మోడ్'ను పరీక్షించడానికే తాను సరస్సులోకి వెళ్లినట్లు డ్రైవర్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. సరస్సులో నిషేధిత ప్రాంతంలో వాహనం నడపడం, ఇతర భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు అతడిని అరెస్టు చేశారు. "ఒక వాహనం నీటిలోకి వెళ్లగల సామర్థ్యం కలిగి ఉండవచ్చు. కానీ, టెక్సాస్ చట్టం ప్రకారం అలా చేయడం చట్టపరమైన, భద్రతాపరమైన సమస్యలకు దారితీస్తుంది" అని పోలీసులు ఓ ప్రకటనలో హెచ్చరించారు.

బుల్లెట్ ప్రూఫ్ స్టీల్ మెటీరియల్‌తో తయారైన ఈ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ ధర సుమారు రూ.58 లక్షలకు పైగా ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీ ఉన్నప్పటికీ, దానిని ఎలా, ఎక్కడ వాడాలో తెలుసుకోకపోతే ఇలాంటి ఇబ్బందులు తప్పవని ఈ ఘటన హెచ్చరిస్తోంది.