రైల్వే స్టేషన్‌కు వెళ్లగానే మనకు ఎన్నో రకాల రైళ్లు కనిపిస్తాయి. కొన్ని నీలం రంగులో ఉంటే.. మరికొన్ని ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో దర్శనమిస్తాయి. అసలు రైలు పెట్టెలకు ఇలా వేర్వేరు రంగులు ఎందుకు వేస్తారు? ఇవి కేవలం అందం కోసమేనా? లేక వాటి వెనుక ఏదైనా ప్రత్యేక అర్థం ఉందా? ప్రతి రంగు రైలు రకం, ప్రయాణ సౌకర్యాలు, సాంకేతికత గురించి కొన్ని వివరాలను తెలియజేస్తుంది.

నీలం రంగు బోగీలు
భారతీయ రైల్వేల్లో ఎక్కువగా కనిపించేవి నీలం రంగు బోగీలే. వీటిని సాధారణంగా ఐసీఎఫ్‌ కోచ్‌లుగా గుర్తిస్తారు. స్లీపర్‌, జనరల్‌ వంటి తరగతుల్లో ఇవి ఎక్కువగా ఉపయోగిస్తారు. దేశవ్యాప్తంగా సాధారణ రైళ్లలో ఈ రంగు బోగీలు విస్తృతంగా కనిపిస్తాయి.

ఎరుపు రంగు పెట్టెల ప్రత్యేకత
ఎరుపు రంగు పెట్టెలు సాధారణంగా ఎల్‌హెచ్‌బీ (LHB) కోచ్‌లను సూచిస్తాయి. ఇవి ఆధునిక సాంకేతికతతో రూపొందించినవి. మెరుగైన భద్రతా ప్రమాణాలు, ప్రయాణంలో సౌకర్యం వీటి ప్రత్యేకత. ప్రమాదాల సమయంలో కోచ్‌లు ఒకదానిపై మరొకటి ఎక్కే ప్రమాదాన్ని తగ్గించేలా వీటి నిర్మాణం ఉంటుంది.

ఆకుపచ్చ రంగు దేనికి సంకేతం?
ఆకుపచ్చ రంగు పెట్టెలను సాధారణంగా తక్కువ ఖర్చుతో ప్రయాణించే రైళ్లలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా అందుబాటు ధరల్లో ప్రయాణ సౌకర్యం కల్పించే రైళ్లకు ఈ రంగు కనిపిస్తుంది. అయితే రంగును బట్టి మాత్రమే రైలు తరగతిని నిర్ణయించలేం.

తెలుపు రంగు పెట్టెల్లో ఆధునికత
తెలుపు రంగు పెట్టెలు సాధారణంగా సెమీ హైస్పీడ్‌ రైళ్లలో కనిపిస్తాయి. ఆధునిక సాంకేతికత, వేగవంతమైన ప్రయాణానికి ఇవి గుర్తుగా నిలుస్తాయి. వందే భారత్‌ వంటి రైళ్లలో ప్రత్యేక రంగుల రూపకల్పన కనిపిస్తుంది.

చారలు, గుర్తులకూ ప్రత్యేక అర్థం
కోచ్‌లపై ఉండే రంగులతో పాటు వాటిపై కనిపించే చారలు, గుర్తులు కూడా ప్రయాణికులకు సమాచారం అందిస్తాయి. పసుపు రంగు చారలు ప్రత్యేక సౌకర్యాలు కలిగిన కోచ్‌లను గుర్తించేందుకు ఉపయోగపడతాయి. కొన్ని రైళ్లలో తెలుపు గుర్తులు జనరల్‌ బోగీలను సూచిస్తాయి. రైల్వే స్టేషన్లలో కోచ్‌లను సులభంగా గుర్తించేందుకు ఈ రంగుల విధానం ఉపయోగపడుతుంది.