కట్టుకున్న భార్యకే 20 ఏళ్లకు పైగా మత్తుమందు ఇచ్చి, ఆమె స్పృహలో లేనప్పుడు అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. ఆ అకృత్యాలను తన ఫోన్‌లో భద్రపరిచాడో భర్త. బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో వెలుగు చూసిన ఈ ఘటనలో నిందితుడైన భర్త ఫోన్‌లో 10 లక్షలకుపైగా ఫొటోలు, వీడియోలను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే భర్త సహా ఐదుగురు నేరాన్ని అంగీకరించగా, మరో తొమ్మిది మందిపై  సోమవారం మాంచెస్టర్‌లోని మిన్‌షుల్ స్ట్రీట్ క్రౌన్ కోర్టులో విచారణ ప్రారంభమైంది.

బాధితురాలి గోప్యతను కాపాడేందుకు భర్త పేరును అధికారులు వెల్లడించలేదు. 60 ఏళ్ల వయసున్న ఆ భర్త.. అత్యాచారం, లైంగిక దాడి, మత్తుమందు ఇవ్వడం, అసభ్యకర ఫొటోలు పంచుకోవడం వంటి 62 అభియోగాలను గత సెప్టెంబర్‌లోనే అంగీకరించాడు. అరెస్ట్ తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకున్న అతడి ఫోన్‌లో పది లక్షలకు పైగా చిత్రాలు, వీడియోలు లభించాయని ప్రాసిక్యూటర్ లూయీస్ ఓక్లీ కోర్టుకు తెలిపారు. ఆ ఫోన్‌లో అతడి "పైశాచిక లైంగిక వాంఛలు", "అత్యాచారాలకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్" ఉందని, కొన్ని ఆధారాలు 2004 నాటివని ఆమె వివరించారు.

విచారణలో మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. ఆ దంపతులు స్నేహితులు, బంధువులతో ఎంతో సాధారణ జీవితం గడిపారు. విహారయాత్రలకు వెళ్తూ, రిటైర్మెంట్ ప్రణాళికలు వేసుకుంటూ అందరిలాగే కనిపించారు. కానీ తెరవెనుక, భర్త తన భార్యకు తరచూ మత్తుమందు ఇచ్చి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లాక అత్యాచారానికి పాల్పడేవాడు. గడిచిన తొమ్మిదేళ్లుగా తాను శృంగారానికి దూరంగా ఉన్నానని 60 ఏళ్ల వయసున్న ఆ భార్య భావించడం ఈ ఘటన తీవ్రతకు అద్దం పడుతోంది.

2023 నుంచి నిందితుడు తన పైశాచికత్వాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఇతర వ్యక్తులను ఇంటికి ఆహ్వానించి, భార్య స్పృహలో లేనప్పుడు వారి చేత కూడా అత్యాచారం చేయించాడు. ఈ దారుణాలన్నింటినీ వీడియో తీశాడు. కొంతమంది నేరుగా ఈ అఘాయిత్యంలో పాల్గొనగా, మరికొందరు  దూరం‌గా వుండి ప్రోత్సహించినట్టు ఆరోపణలున్నాయి. ఫ్రాన్స్‌లో సంచలనం సృష్టించిన డొమినిక్ పెలికాట్ కేసును ఈ ఘటన గుర్తుచేస్తోంది. ప్రస్తుతం నిందితులుగా ఉన్న తొమ్మిది మందిపై విచారణ కొనసాగుతోంది.