వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో గోపిక అనే విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌ను కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నిందితుడిని రక్షించేందుకే జగన్ తన అనుచరుల ద్వారా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) వేయించారని పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేసిన సాల్మన్‌ రాజు, మంగళగిరికి చెందిన వైసీపీ సానుభూతిపరుడు గుండా గోపీకృష్ణ ఈ వ్యాజ్యం వేశారని ఆమె వివరించారు. 'ఒకవైపు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆడబిడ్డను పరామర్శించి మొసలి కన్నీరు కారుస్తూనే, మరోవైపు ఆ దాడికి పాల్పడిన వ్యక్తిని కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఆయన ఇంతటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారు' అని మాధవి మండిపడ్డారు.

నిందితుడిపై పోలీసులు అనవసరంగా కాల్పులు జరిపారని, అతడిని "కుక్కలా ఈడ్చుకెళ్లారు" అని కోర్టులో వాదించడం అత్యంత హేయమైన చర్య అని ఆమె అన్నారు. బాధితురాలి కుటుంబానికి రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న జగన్, తన వంతుగా ఒక్క రూపాయి కూడా ఎందుకు సాయం చేయలేదని ప్రశ్నించారు. మహిళల పట్ల జగన్ వైఖరి ఇదేనని, రాష్ట్రంలోని మహిళా లోకం ఆయన్ను ఎప్పటికీ క్షమించదని గళ్లా మాధవి స్పష్టం చేశారు.