రాప్తాడులో పాఠశాల విద్యార్థినిపై రంపంతో దాడికి పాల్పడిన ఉన్మాది హేమంత్‌పై పోలీసులు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలిని కాపాడే ప్రయత్నంలో గాయపడిన మరో విద్యార్థిని లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్యాయత్నం సహా పలు కీలక సెక్షన్లు చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుల తీవ్రత దృష్ట్యా నిందితుడికి జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు హేమంత్‌పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌) సెక్షన్ 109(1) కింద హత్యాయత్నం, సెక్షన్ 118(1) కింద రంపంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినందుకు కేసులు నమోదు చేశారు. అలాగే, పాఠశాలలోకి ఆయుధంతో చొరబడినందుకు బీఎన్ఎస్‌ సెక్షన్ 333ను కూడా జోడించారు. దీనికి తోడు బాధితురాలు గోపిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంలోని సెక్షన్ 3(2)(వీ) కింద కూడా కేసు నమోదు చేశారు.

మరోవైపు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని గోపిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. పోలీసుల కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు హేమంత్ కాలును తొలగించాల్సి రావొచ్చని వైద్యులు ఇదివరకే వెల్లడించారు.