అమెరికాలో మ‌ధ్యంత‌ర‌ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన సోమవారం, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తమ విజయాలపై ఒక కీలక నివేదికను విడుదల చేసింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ప్రజలకు ఇచ్చిన 127 హామీలను నిలబెట్టుకున్నామని వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత్‌తో మెరుగైన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం కూడా ఒక కీలక విజయంగా పేర్కొంది.

"ప్రెసిడెంట్ ట్రంప్ రెండో పదవీకాలం: ఇచ్చిన మాటలు, నిలబెట్టుకున్న హామీలు, సాధించిన ఫలితాలు" అనే పేరుతో ఈ నివేదికను విడుదల చేశారు. ఇందులో వాణిజ్య ఒప్పందాలపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్‌తో పాటు యూకే, యూరోపియన్ యూనియన్, జపాన్, చైనా వంటి ప్రధాన భాగస్వాములతో కొత్త, మెరుగైన వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నామని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. ఈ దేశాలన్నీ కలిపి ప్రపంచ జీడీపీలో సగానికి పైగా వాటాను కలిగి ఉన్నాయని పేర్కొంది. అమెరికా విధించిన టారిఫ్‌ల (సుంకాలు) ఒత్తిడి కారణంగానే ఈ ఒప్పందాలు సాధ్యమయ్యాయని నివేదికలో ఘనతను ఆపాదించుకుంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్, అమెరికా మధ్య ఒక తాత్కాలిక వాణిజ్య ఒప్పంద ఫ్రేమ్‌వర్క్‌పై అవగాహన కుదిరిన విషయం తెలిసిందే. దీనిని అమలు చేయడంతో పాటు మరింత విస్తృతమైన ద్వైపాక్షిక ఒప్పందం కోసం ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని అప్పట్లో ప్రకటించాయి. ఇప్పుడు ఈ ఫ్రేమ్‌వర్క్‌ను తమ విజయంగా ట్రంప్ ప్రభుత్వం తన నివేదికలో చేర్చింది.

వాణిజ్య ఒప్పందాల అంశంతో పాటు ఈ నివేదికలో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలను కూడా ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వివాదాల్లో శాంతి స్థాపనకు తాము సహాయపడ్డామని వైట్‌హౌస్ పేర్కొంది. ఇందులో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించి శాంతిని నెలకొల్పడంలో తమ పాత్ర ఉందని చెప్పడం గమనార్హం. 

కాగా, అమెరికాలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోని అన్ని స్థానాలకు, సెనెట్‌లోని మూడింట ఒక వంతు స్థానాలకు నేడు మ‌ధ్యంత‌ర‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం ఈ విజయాల నివేదికను విడుదల చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.