మనకు సుపరిచితమైన.. దక్షిణ, మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన సాధారణ గోరింక పక్షి (కామన్ మైనా), ఆస్ట్రేలియాలో 'అత్యంత ద్వేషించబడే పక్షి'గా పేరుపొందింది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి హాని కలిగించే 100 అత్యంత ప్రమాదకర జాతులలో ఒకటిగా అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంస్థ (IUCN) దీనిని గుర్తించింది. నిరంతరం శబ్దం చేసే ఈ పక్షులు ఆస్ట్రేలియాలో విస్తారంగా కనిపిస్తాయి.

ఆసక్తికరంగా, ఈ పక్షులను 1860వ దశకంలో ఆస్ట్రేలియాకు ఉద్దేశపూర్వకంగానే తీసుకెళ్లారు. పంటలను నాశనం చేసే మిడతలు, ఇతర కీటకాలను నియంత్రించేందుకు వీటిని ప్రవేశపెట్టారు. తొలినాళ్లలో వీటిని ప్రజలు ఆదరించారు. "సున్నితమైనవి," "చురుకైనవి" అంటూ పక్షి ప్రేమికులు ప్రశంసించారు. ఆర్థికంగా పెద్దగా నష్టం కలిగించని ఈ పక్షులను స్థానికులు తమలో ఒకటిగా భావించారు.

అయితే, 1970-90ల మధ్యకాలంలో ప్రజల దృక్పథం పూర్తిగా మారిపోయింది. దేశంలోకి కొత్తగా వస్తున్న జాతులపై వ్యతిరేకత పెరగడంతో, మైనాలను "దుండగులు," "ఎగిరే చెరకు కప్పలు" (flying cane toads) అని పిలవడం మొదలుపెట్టారు. స్థానిక చిలకల గూళ్లను ఇవి ఆక్రమించుకుంటున్నాయని శాస్త్రీయ పరిశోధనలు ఆలస్యంగా వెల్లడించాయి.

‘స్క్రోల్.ఇన్’ కథనం ప్రకారం.. మైనాల సంఖ్యను తగ్గించడానికి స్థానిక కమ్యూనిటీలు అనేకసార్లు ప్రయత్నించాయి. వాటిని పట్టుకోవడం, బహుమతులు ప్రకటించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. కానీ, ఈ ప్రయత్నాలు తాత్కాలిక ఫలితాలనే ఇచ్చాయి. జనాభా కాస్త తగ్గినా, మళ్లీ వేగంగా పుంజుకుంటోంది. కొన్నిసార్లు, మైనాలను తొలగిస్తే, వాటి స్థానంలో మరో దూకుడు స్వభావం గల 'నాయిసీ మైనర్' వంటి దేశీయ పక్షులు వచ్చి, మరింత నష్టం కలిగిస్తున్నాయి.

మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన పర్యావరణ చరిత్రకారుడు సైమన్ ఫార్లీ ప్రకారం, పక్షి ప్రవర్తన మారలేదు, కేవలం మనుషుల వైఖరే మారింది. వీటిని పూర్తిగా నిర్మూలించడం అసాధ్యమని, కొన్నిసార్లు గెలవలేని యుద్ధం చేయడం కంటే, కొత్తగా ఏర్పడిన పర్యావరణ సమతుల్యతను అంగీకరించడమే సరైన మార్గమని ఆయన సూచిస్తున్నారు. మైనాలపై అతిగా దృష్టి పెట్టి, ఆవాసాల పరిరక్షణ వంటి పెద్ద సమస్యలను విస్మరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.