పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. కౌంటింగ్‌ నిలిపివేయాలంటూ వైసీపీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి వైఎస్‌ ప్రమీల, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. దీంతో ఓట్ల లెక్కింపునకు మార్గం సుగమమైంది.

పులివెందుల మున్సిపాలిటీలో రాష్ట్ర ఎన్నికల సంఘం నాలుగు వార్డుల్లో రీపోలింగ్‌ నిర్వహించింది. అయితే ఆ వార్డులకే పరిమితం కాకుండా మున్సిపాలిటీ పరిధిలోని మిగతా అన్ని వార్డుల్లోనూ మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలని ప్రమీల, అవినాష్‌రెడ్డి కోరారు. అప్పటివరకు ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్లపై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. మంగళవారం ఉదయం 7.30 గంటలకు ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కౌంటింగ్‌ నిలిపివేయాలన్న పిటిషన్లను కొట్టివేసింది. దీంతో పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఉన్న అడ్డంకి తొలగింది.