రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం ఢిల్లీలో పరామర్శించారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న లాలూ నివాసానికి వెళ్లిన ఆమె, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలోని లోథీ ఎస్టేట్‌లో ఉన్న లాలూ కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు మీసా భారతి నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో లాలూ కుమారుడు, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా పాల్గొన్నారు.

ఈ భేటీకి సంబంధించిన వివరాలను లాలూ ప్రసాద్ యాదవ్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. "గౌరవనీయులైన శ్రీమతి సోనియా గాంధీ గారు స్వయంగా విచ్చేసి నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా మేం పాత రోజులను గుర్తుచేసుకున్నాం. యూపీఏ ప్రభుత్వ హయాంలో యువత, రైతులు, సామాన్యుల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు, అలాగే ఉపాధి హామీ, విద్యా హక్కు, సమాచార హక్కు వంటి చట్టాల ద్వారా ప్రజలను ఎలా సాధికారితం చేశామో చర్చించుకున్నాం. డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో బిహార్ అభివృద్ధికి రూ.1.45 లక్షల కోట్లకు పైగా నిధులు ఎలా కేటాయించామో స్మరించుకున్నాం" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

అనంతరం తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, తమ రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. తన తండ్రి అనారోగ్యంతో ఢిల్లీలో ఉన్నారని తెలిసి సోనియా గాంధీ పరామర్శించడానికి వచ్చారని, ఇది కేవలం యోగక్షేమాలను తెలుసుకోవడానికి జరిగిన మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూను ఇటీవల పాట్నాలోని ఐజీఐఎంఎస్ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.