ఉపాధి హామీ పథకాన్ని కూటమి సర్కార్ నిర్వీర్యం చేస్తోంది: జగన్
- గ్రామీణ ఆర్థిక వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందన్న జగన్
- గత రెండేళ్లుగా ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రం వెనుకబాటులో ఉందని వెల్లడి
- ఉపాధి హామీ వ్యయం, పనిచేసిన కుటుంబాల సంఖ్య తగ్గాయని ఆరోపణ
- అవినీతిపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని విమర్శ
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆదాయాన్ని పెంచడంలో ఉపాధి హామీ పథకం అత్యంత కీలకమని జగన్ పేర్కొన్నారు. చారిత్రకంగా ఈ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉండేదని, కానీ గత రెండేళ్ల టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రం వెనుకబడిపోయిందని విమర్శించారు. ఆమోదించిన లేబర్ బడ్జెట్, పథకం కింద పనిచేసిన కుటుంబాల సంఖ్య, మొత్తం వ్యయం వంటి అన్ని కొలమానాల్లోనూ పనితీరు గణనీయంగా తగ్గిపోయిందని ఆయన వివరించారు.
ఈ ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోందని జగన్ తెలిపారు. గత రెండేళ్లుగా జీఎస్టీ, అమ్మకం పన్ను వసూళ్లు మందగించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. "టీడీపీ కూటమి ప్రభుత్వం అవినీతి, సంపదపై ఉన్న యావతోనే నిమగ్నమై ఉంది. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టే సమయం వారికి లేదు" అని జగన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తన ప్రాధాన్యతలను మార్చుకొని, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు.