విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన... తాను ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లోనే చేదు అనుభవాన్ని మూటగట్టుకున్నారు. విజయవాడ మేయర్ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూశారు. ప్రధాన పార్టీలకు దీటుగా విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించినప్పటికీ, ఆయన కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో బరిలోకి దిగిన ఆయన, ఓట్ల సాధనలో మాత్రం పూర్తిగా వెనకబడ్డారు.

నగరంలోని మూడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేపట్టిన ఏబీ వెంకటేశ్వరరావు గౌరవప్రదమైన ఓట్లు సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారు. అర్ధరాత్రి 1.30 గంటలకు వెలువడిన ఫలితాల్లో ఆయనకు కేవలం 11,137 ఓట్లు మాత్రమే సాధించారు. ఈ ఫలితాలు వామపక్షాల ఓటు బ్యాంకు కూడా ఆయనకు బదిలీ కాలేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కూటమిగా ఏర్పడి మద్దతు ప్రకటించినా, ఆ ఓట్లు ఏబీవీకి పడకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రచారంలో చూపిన జోరు, ఫలితాల్లో కనిపించకపోవడంతో ఆయన వర్గీయులు నిరాశ చెందారు.