అమెరికాలోని ఓ ఫుట్‌బాల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బాణసంచా ప్రదర్శన పెను ప్రమాదానికి దారితీసినంత పనిచేసింది. ఆకాశంలో ఎగురుతున్న యూఎస్ ఆర్మీ హెలికాప్టర్‌కు అత్యంత సమీపంలో ఫైర్‌వర్క్స్ పేలడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన సియాటిల్‌లోని ల్యూమెన్ ఫీల్డ్ స్టేడియంలో సోమవారం చోటుచేసుకుంది.

'నేషనల్ ఫుట్‌బాల్ లీగ్' (ఎన్ఎఫ్ఎల్‌)లో భాగంగా సియాటిల్ సీహాక్స్, చికాగో బేర్స్ జట్ల మధ్య సోమవారం రాత్రి మ్యాచ్ జరగాల్సి ఉంది. మ్యాచ్‌కు ముందు నిర్వహించే వేడుకల కోసం అమెరికా సైన్యానికి చెందిన నాలుగు హెలికాప్టర్లతో ఫ్లైఓవర్ ఏర్పాటు చేశారు. జాతీయ గీతాలాపన సమయంలో హెలికాప్టర్లు స్టేడియం మీదుగా ప్రయాణించాయి.

న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. మూడు హెలికాప్టర్లు స్టేడియం దాటి వెళ్లిన తర్వాత నాలుగో హెలికాప్టర్ గాల్లో ఉండగానే నిర్వాహకులు బాణాసంచా పేల్చారు. దీంతో ఆ ఫైర్‌వర్క్స్ హెలికాప్టర్‌కు అత్యంత దగ్గరగా పేలాయి. ఈ అనూహ్య పరిణామంతో స్టేడియంలో ఉన్న సుమారు 70,000 మంది ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. కొందరు ఆశ్చర్యంతో కేకలు వేశారు.

అయితే, అదృష్టవశాత్తూ హెలికాప్టర్‌కు ఎలాంటి నష్టం జరగలేదు. పైలట్ దానిని సురక్షితంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వేడుకలో భాగంగా జరగాల్సిన కార్యక్రమం కాస్తా, అందరినీ భయపెట్టే ఉద్రిక్త క్షణంగా మారింది.