భారత క్రికెట్ జట్టుకు శుభవార్త. కొంతకాలంగా తొడ కండరాల గాయంతో జట్టుకు దూరమైన ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ పూర్తిగా కోలుకున్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ నిరూపించుకున్న అతను.. న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరాడు. ప్రస్తుతం ఫాస్ట్ బౌలర్ల కొరతతో ఇబ్బంది పడుతున్న టీమిండియాకు అతని పునరాగమనం పెద్ద ఊరటనిచ్చే అంశం.

ఐఏఎన్ఎస్ కథనం ప్రకారం.. నవంబర్ 1, 2 తేదీల్లో ప్రసిద్ధ్ కృష్ణకు మ్యాచ్ సిమ్యులేషన్ సెషన్లు నిర్వహించారు. అందులో అతని ఫిట్‌నెస్‌పై సంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ వైద్య బృందం, పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అతను వెంటనే న్యూజిలాండ్‌కు పయనమయ్యాడు. అక్కడ ఇండియా-ఎ జట్టుతో కలిసి, నవంబర్ 7 నుంచి న్యూజిలాండ్-ఎ జట్టుతో జరగనున్న మూడో రెడ్-బాల్ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు.

సెప్టెంబర్ 30న వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ప్రసిద్ధ్ గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు బౌలింగ్ సమస్యలతో సతమతమవుతోంది. సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వన్డే సిరీస్‌కు విశ్రాంతినిచ్చారు. మరోవైపు, హర్షిత్ రాణా గాయంతో సిరీస్ మొత్తానికీ దూరమయ్యాడు. మహమ్మద్ సిరాజ్ కూడా తొలి మూడు వన్డేల అనంతరం టెస్టులకు సిద్ధమయ్యేందుకు జట్టును వీడనున్నాడు. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ్ రాక జట్టుకు ఎంతో కీలకంగా మారింది.

టెస్ట్ సిరీస్‌కు ముందు ఇండియా-ఎ తరఫున ఆడటం ద్వారా న్యూజిలాండ్ పిచ్‌లు, అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ప్రసిద్ధ్ కు ఇది చక్కటి అవకాశం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్‌కు ఈ టెస్ట్ సిరీస్ ఎంతో ముఖ్యం. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది.

టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ నవంబరు 19 నుంచి జరగనుంది.