అమెరికా రాజకీయాల్లో భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒహాయో రాష్ట్ర గవర్నర్‌ ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి అమీ ఆక్టన్‌ విజయం సాధించారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున బరిలోకి దిగిన వివేక్‌ రామస్వామి ఓటమి పాలయ్యారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతు, భారీగా ఖర్చు చేసిన ప్రచార నిధులు కూడా ఆయనను గెలిపించలేకపోయాయి. దీంతో ఒహాయో రాజకీయాల్లో ఈ ఫలితం ప్రాధాన్యం సంతరించుకుంది. 

20 ఏళ్ల తర్వాత డెమోక్రాట్లకు పీఠం
అమీ ఆక్టన్‌ విజయంతో ఒహాయోలో రెండు దశాబ్దాల తర్వాత డెమోక్రటిక్‌ పార్టీకి గవర్నర్‌ పదవి దక్కింది. ఈ రాష్ట్రానికి గవర్నర్‌గా ఎన్నికైన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. వైద్యురాలైన ఆక్టన్‌ గతంలో ఒహాయో రాష్ట్ర ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌గా పనిచేశారు. కరోనా మహమ్మారి సమయంలో ఆమెకు గుర్తింపు లభించింది. ప్రజలపై పెరుగుతున్న జీవన వ్యయం, వైద్య సేవల ఖర్చుల్ని ప్రధాన ప్రచార అంశాలుగా చేసుకున్నారు. 

భారీ ఖర్చు చేసినా దక్కని విజయం
ఈ ఎన్నికల్లో వివేక్‌ రామస్వామి, ఆయనకు మద్దతిచ్చిన వర్గాలు కలిపి 100 మిలియన్‌ డాలర్లకు పైగా ఖర్చు చేశాయి. అధ్యక్షుడు ట్రంప్‌ కూడా రామస్వామి తరఫున ప్రచారం చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సైతం ఆయనకు మద్దతుగా రంగంలోకి దిగారు. అయినా ఓటర్లు అమీ ఆక్టన్‌కే పట్టం కట్టారు. 

వివాదాస్పద ప్రకటనతో దెబ్బ
ఎన్నికల ప్రచార చివరి దశలో రామస్వామి బృందం విడుదల చేసిన ప్రకటన వివాదానికి దారితీసింది. అందులో ఆక్టన్‌కు దూరంగా ఉంటున్న ఆమె తల్లి కనిపించారు. ఆక్టన్‌ తన గతం గురించి అబద్ధాలు చెప్పారని ఆరోపిస్తూ, ఆమెకు ఓటు వేయొద్దని కోరారు. ఈ ప్రకటనపై రెండు పార్టీల నేతల నుంచి విమర్శలు వచ్చాయి. చివరకు ఎన్నికలకు వారం ముందు దాన్ని ప్రసారం చేయడం నిలిపివేశారు. ఈ వివాదం కూడా ప్రచారంపై ప్రభావం చూపింది.