భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘ కెరీర్‌లో అత్యంత ఇష్టమైన కెప్టెన్ల పేర్లను వెల్లడించాడు. ఎందరో సారథుల కింద ఆడినప్పటికీ, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీలే తన దృష్టిలో అత్యుత్తమ కెప్టెన్లని స్పష్టం చేశాడు. ఇటీవల అభిమానులతో జరిగిన ఒక ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సచిన్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"మీరు ఆడిన వారిలో వ్యక్తిగతంగా మీకు ఇష్టమైన కెప్టెన్ ఎవరు?" అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సచిన్ బదులిచ్చాడు. "నాకు ఇష్టమైన కెప్టెన్ల విషయానికొస్తే, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ కచ్చితంగా నా జాబితాలో అగ్రస్థానంలో ఉంటారు" అని తెలిపాడు. గంగూలీ కెప్టెన్సీలో సచిన్ 2003 ప్రపంచకప్ ఫైనల్ ఆడగా, ధోనీ సారథ్యంలో 2011లో ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

ఈ సందర్భంగా తన కెప్టెన్సీ అనుభవాలను కూడా సచిన్ గుర్తుచేసుకున్నాడు. "భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవం. అయితే, ఆ సమయంలో నాకు పూర్తి స్వేచ్ఛ ఉండేది కాదు. నాకు నచ్చిన జట్టును పూర్తిగా ఎంచుకునే అవకాశం ఎప్పుడూ లేదు. 1990లలో ఉన్నదానికంటే బీసీసీఐ ఇప్పుడు చాలా ప్రొఫెషనల్‌గా మారింది. ఆ కాలంలో భారత క్రికెట్ చాలా చీకటి దశను చూసింది" అని వివరించాడు.

ఇదే సమయంలో, దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాపై సచిన్ ప్రశంసలు కురిపించాడు. "బవుమా స్ఫూర్తిని నేను ఎంతో ఆరాధిస్తాను. అతను జట్టును ముందుండి నడిపించి, దక్షిణాఫ్రికా క్రికెట్‌కు అద్భుతమైన ఫలితాలను అందించాడు. దక్షిణాఫ్రికా ఐసీసీ టైటిల్ గెలవడం ప్రపంచ క్రికెట్‌కు ఎంతో మంచిది" అని కొనియాడాడు.

సచిన్ 1996 నుంచి 2000 మధ్య రెండుసార్లు భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా 25 మ్యాచ్‌లలో బాధ్యతలు నిర్వర్తించాడు. 2000 మార్చిలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో సిరీస్ ఓటమి తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత 2007లో మరోసారి టెస్ట్ కెప్టెన్సీని చేపట్టమని కోరగా, తిరస్కరించాడు. దీంతో ఆ బాధ్యతలను ఎంఎస్ ధోనీకి అప్పగించిన విషయం తెలిసిందే.