అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఏడాది కనిష్ఠానికి పడిపోవడంతో భారత్, చైనా దేశాల్లో పసిడి కొనుగోళ్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు పెరగడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు బలపడటంతో అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో బంగారం ధర ఆగస్టు 2025 తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయికి దిగజారింది. ధరల పతనాన్ని అవకాశంగా మార్చుకున్న కొనుగోలుదారులు పెద్ద ఎత్తున మార్కెట్‌కు పోటెత్తారు.

భారత్‌లో ఈ వారం ప్రారంభంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,906 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. 2025 అక్టోబర్ 28 తర్వాత దేశీయ మార్కెట్లో నమోదైన అత్యల్ప ధర ఇదే కావడం విశేషం. అయితే డిమాండ్ పుంజుకోవడంతో శుక్రవారం నాటికి ధర మళ్లీ పుంజుకుని 10 గ్రాములు దాదాపు రూ.1,24,800 వద్ద ట్రేడైంది. ఇంత భారీ దిద్దుబాటును కొనుగోలుదారులు ఊహించలేదని, ధరలు తగ్గడంతో ఆభరణాలతో పాటు నాణేలు, బిస్కెట్లపై పెట్టుబడి పెట్టేందుకు జనం ఆసక్తి చూపుతున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రానున్న పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని జ్యువెలరీ వర్తకులు కూడా తమ నిల్వలను ముందస్తుగా నింపుకుంటున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారు అయిన చైనాలోనూ రిటైల్ అమ్మకాలు జోరందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధర కంటే ఔన్సుకు 9 డాలర్ల ప్రీమియంతో అక్కడ బంగారం విక్రయాలు సాగుతున్నాయి. అమ్మకాలు పెరగడంతో పలు దుకాణాల్లో నిల్వలు కూడా నిండుకున్నట్లు డీలర్లు పేర్కొన్నారు. ఇక అక్టోబరు నెలలో హాంకాంగ్ ద్వారా చైనా చేసిన నికర బంగారం దిగుమతులు అంతకుముందు నెలతో పోలిస్తే 1.6 శాతం పెరిగి ఏప్రిల్ తర్వాత గరిష్ఠ స్థాయికి చేరడం మార్కెట్ బలాన్ని సూచిస్తోంది.