దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ ఖాతాదారులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ ద్వారా జరిగే రూ. 500 లేదా అంతకంటే తక్కువ విలువైన లావాదేవీలకు సంబంధించి ఎస్సెమ్మెస్ (SMS) అలర్ట్‌లను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ మార్పు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ తన ఖాతాదారులకు పంపిన సమాచారంలో స్పష్టం చేసింది.

అయితే, ఈ నిర్ణయం కేవలం ఎస్సెమ్మెస్ నోటిఫికేషన్లకు మాత్రమే పరిమితం కానుంది. లావాదేవీ విలువ ఎంత ఉన్నప్పటికీ యూపీఐ ద్వారా జరిగే ప్రతి చెల్లింపునకు సంబంధించి ఈమెయిల్ అలర్ట్‌లు యథావిధిగా ఖాతాదారులకు అందుతాయి. అదేవిధంగా రూ. 500 కంటే ఎక్కువ మొత్తంతో జరిగే లావాదేవీలకు తక్షణ ఎస్సెమ్మెస్ నోటిఫికేషన్లు ఎప్పటిలాగే వస్తాయని బ్యాంక్ వివరించింది. తాజా మార్పు వల్ల రూ. 100, రూ. 200, రూ. 300, రూ. 400 లేదా రూ. 500 విలువైన యూపీఐ చెల్లింపులు చేసినప్పుడు జనవరి 1 నుంచి మొబైల్ నంబర్‌కు ఎలాంటి కన్ఫర్మేషన్ ఎస్సెమ్మెస్ రాదు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల అలర్ట్స్‌పై జారీ చేసిన సవరించిన నిబంధనల ఆధారంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలు వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు వర్తిస్తాయి. 

ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. రూ. 500 దాటిన ప్రతి ఎలక్ట్రానిక్ లావాదేవీకి బ్యాంకులు తప్పనిసరిగా తక్షణ ఎస్సెమ్మెస్ అలర్ట్ పంపించాలి. అదే సమయంలో రూ. 500 లేదా అంతకంటే తక్కువ విలువైన లావాదేవీలకు ఎస్సెమ్మెస్ నోటిఫికేషన్లు ఇవ్వాలా వద్దా అనేది బ్యాంకులు తమ అంతర్గత పాలసీ ప్రకారం నిర్ణయించుకునే వెసులుబాటును ఆర్బీఐ కల్పించింది. అయితే ఇలాంటి చిన్న లావాదేవీల అలర్ట్స్‌కు కస్టమర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని స్పష్టం చేసింది.

దేశంలో యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల అక్టోబర్ నెలలో యూపీఐ లావాదేవీలు సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరాయి. ఆ ఒక్క నెలలోనే ఏకంగా రూ. 31.53 లక్షల కోట్ల విలువైన 2,547 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. యూపీఐ చరిత్రలోనే మొదటిసారిగా సగటు రోజువారీ లావాదేవీల విలువ రూ. 1 లక్ష కోట్ల మైలురాయిని దాటింది. రోజుకు సగటున 82.2 కోట్ల లావాదేవీలు జరుగుతుండగా, వాటి రోజువారీ విలువ సగటున రూ. 1.01 లక్షల కోట్లకు పైగా నమోదవుతోంది.

లావాదేవీల సమాచారం, ఈ-స్టేట్‌మెంట్లు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని నిరంతరం పొందేందుకు ఖాతాదారులు తమ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీని సరిచూసుకోవాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సూచించింది. ఈమెయిల్ ఐడీని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసి ఉంచడం వల్ల సేవలలో అంతరాయం కలగకుండా ఉండటంతో పాటు డిజిటల్ భద్రత కూడా మెరుగవుతుందని పేర్కొంది.

ఖాతాదారులు తమ అకౌంట్ రకాన్ని బట్టి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఈమెయిల్ ఐడీని సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చని బ్యాంక్ తెలిపింది. రెసిడెంట్ ఇండివిడ్యువల్స్, ఏయూఎస్ (AUS), బీవో (BO) కస్టమర్లు ఇన్‌స్టాసర్వీసెస్ (InstaServices), నెట్‌బ్యాంకింగ్ ద్వారా లేదా నేరుగా బ్రాంచ్‌కు వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఎన్నారై (NRI) కస్టమర్లు కూడా నెట్‌బ్యాంకింగ్ ద్వారా లేదా సంబంధిత ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకొని సమర్పించవచ్చు. సోల్ ప్రొప్రైటర్‌షిప్ ఖాతాదారులు ఆన్‌లైన్ లేదా బ్రాంచ్ ద్వారా మార్పులు చేసుకోవచ్చు. అయితే ప్రైవేట్/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు, పార్ట్‌నర్‌షిప్ సంస్థలు, ఎల్‌ఎల్‌పీలు, హెచ్‌యూఎఫ్‌లు, ట్రస్టులు, సొసైటీల ఖాతాదారులు మాత్రం తమ సమీప హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ శాఖను నేరుగా సందర్శించి ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.