చైనా సహకారంతో పాకిస్థాన్ అంతరిక్ష సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి హెచ్చరించారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని భారత్ సైతం తన అంతరిక్ష, నిఘా వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఢిల్లీలోని వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన ‘ఫ్యూచర్ ఆఫ్ వార్‌ఫేర్’ సదస్సులో ఆయన మాట్లాడారు. చైనా ఉపగ్రహ నిఘా, గూఢచర్య, నావిగేషన్ సాంకేతికత పాకిస్థాన్‌కు అందుబాటులోకి వస్తుందని, వీరికి టర్కీ కూడా సహకరిస్తుందని భావించాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ సవాళ్లను తిప్పికొట్టేందుకు భారత అంతరిక్ష నిఘా వ్యవస్థ ఫేజ్-3 (ఎస్‌బీఎస్-3) కీలక పాత్ర పోషిస్తుందని సీడీఎస్ చెప్పారు. రూ.26,968 కోట్ల వ్యయంతో సరిహద్దులు, హిందూ మహాసముద్ర పరిధిపై నిఘా ఉంచేందుకు 52 నిఘా ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు వివరించారు. చైనాతో పోటీ పడి ఆయుధ పోటీలో దిగాల్సిన అవసరం లేదని, సరిహద్దుల రక్షణకు తగ్గట్లుగా మన అవసరాలకు అనుగుణమైన సామర్థ్యాలను పెంచుకుంటే సరిపోతుందని స్పష్టం చేశారు. నావిక్, ఎస్‌బీఎస్-3, జీశాట్-7 వ్యవస్థలు ఈ దిశగా రక్షణ కల్పిస్తాయని తెలిపారు.

డ్రోన్ల దాడులను సమర్థంగా అడ్డుకునేందుకు డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన లేజర్, డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ (డీఈడబ్ల్యూ)ను త్వరలోనే సైన్యంలోకి ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా మారుతున్న నేపథ్యంలో ఆయుధాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సవరించిన రక్షణ సేకరణ విధానం (డీఏపీ) ముసాయిదాను ప్రధాని కార్యాలయానికి సమర్పించినట్లు చెప్పారు. భవిష్యత్ యుద్ధాల్లో నిఘా వ్యవస్థల ప్రాధాన్యం విపరీతంగా పెరిగిపోయిందని, సైబర్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ విభాగాలను ఆధునికీకరిస్తూ సంయుక్త సైనిక చర్యలకు బలగాలు సన్నద్ధం కావాలని ఆయన దిశానిర్దేశం చేశారు.