జీవిత తొలిదశలో, ముఖ్యంగా గర్భం దాల్చినప్పటి నుంచి రెండేళ్ల వయసు వరకు చక్కెర వాడకాన్ని తగ్గించడం వల్ల పెద్దయ్యాక పలు రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని ఓ తాజా అధ్యయనం తేల్చింది. ఇది శరీర జీవసంబంధ వృద్ధాప్యాన్ని కూడా నెమ్మదింపజేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధన వివరాలు "ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్" జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

ఈ అధ్యయనం కోసం పరిశోధకులు యూకే బయోబ్యాంక్‌కు చెందిన 64,761 మంది ఆరోగ్య డేటాను విశ్లేషించారు. 1951 నుంచి 1956 మధ్య జన్మించిన వీరిని పరిశీలించారు. 1953 సెప్టెంబర్‌లో బ్రిటన్‌లో చక్కెరపై రేషనింగ్ విధానం ముగిసింది. దీన్ని ఒక సహజ ప్రయోగంగా తీసుకుని, రేషనింగ్ సమయంలో (చక్కెర తక్కువగా లభించినప్పుడు) పుట్టిన వారిని, ఆ తర్వాత పుట్టిన వారిని పోల్చి చూశారు.

చక్కెరపై రేషనింగ్ ఉన్న కాలంలో పుట్టి, తక్కువ చక్కెర వినియోగించిన వారిలో దశాబ్దాల తర్వాత క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. కాలేయ క్యాన్సర్ 69 శాతం, ప్రొస్టేట్ క్యాన్సర్ 52 శాతం, ఊపిరితిత్తుల క్యాన్సర్ 41 శాతం, మలద్వార క్యాన్సర్ 40 శాతం, రొమ్ము క్యాన్సర్ 36 శాతం వరకు తగ్గినట్లు డేటా విశ్లేషణలో తేలింది.

ఈ ఫలితాలకు రెండు ప్రధాన కారణాలను పరిశోధకులు గుర్తించారు. మొదటిది, ప్రవర్తనా మార్పు. చిన్నప్పుడు తక్కువ చక్కెరతో కూడిన ఆహారం తిన్నవారు, 50 ఏళ్ల తర్వాత కూడా తక్కువ చక్కెర, తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను కొనసాగించడం గమనించారు. రెండోది, జీవసంబంధ మార్పు. చిన్నప్పుడు తక్కువ చక్కెర తీసుకున్న వారిలో తెల్ల రక్త కణాల్లోని టెలోమియర్ల పొడవు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ఇది వారి జీవసంబంధ వయసు సుమారు 2.2 ఏళ్లు తక్కువగా ఉండటంతో సమానమని పేర్కొన్నారు.

మొత్తం మీద, జీవితంలో తొలి 1000 రోజులు అత్యంత కీలకమని, ఆ సమయంలో తీసుకునే పోషకాహారం జీవితకాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా చక్కెర వాడకాన్ని నియంత్రించడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పును తగ్గించుకోవచ్చని సూచిస్తోంది.