మనం రోజూ వంట కోసం వాడే పాత్రలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తాజా అధ్యయనం తేల్చిచెప్పింది. ముఖ్యంగా అల్యూమినియం గిన్నెల్లో వండిన పదార్థాలు తినడం వల్ల శరీరంలోకి హానికరమైన రసాయనాలు చేరుతున్నాయని హైదరాబాద్‌లో జరిగిన పరిశోధనలో వెల్లడైంది. మట్టి, రాగి, స్టీల్ పాత్రలతో పోలిస్తే, అల్యూమినియం గిన్నెలో వండిన అన్నంలో ఏకంగా 14 రెట్లు అధికంగా అల్యూమినియం ఉన్నట్లు గుర్తించారు.

నగరానికి చెందిన మన్నా బయోటెక్, హిందూ కళాశాల పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. పరిశోధనలో భాగంగా అల్యూమినియం, స్టీల్, రాగి, మట్టి పాత్రల్లో ఒకే రకమైన బియ్యం, సమానమైన నీటితో అన్నం వండి పరీక్షించారు. స్టీల్, రాగి, మట్టి కుండలో వండిన 100 గ్రాముల అన్నంలో అల్యూమినియం స్థాయులు ఒక మిల్లీగ్రాము కంటే తక్కువగా ఉండగా, అల్యూమినియం గిన్నెలో వండిన అన్నంలో మాత్రం ఇది ఏకంగా 19.83 మిల్లీగ్రాములుగా నమోదైంది.

చవకగా దొరకడం, తేలికగా ఉండటం, త్వరగా వేడెక్కడం వంటి కారణాలతో హైదరాబాద్‌లోని స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల్లో 82.9 శాతం మంది అల్యూమినియం పాత్రలనే వాడుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. అయితే, వీటి వాడకం వల్ల కలిగే నష్టాలపై కేవలం 48.6 శాతం మందికి మాత్రమే అవగాహన ఉండటం ఆందోళన కలిగించే విషయం. అల్యూమినియం వల్ల దీర్ఘకాలంలో ఎదురయ్యే వ్యాధుల గురించి తెలిసిన వారు కేవలం 5.7 శాతం మందే ఉన్నారని అధ్యయనం పేర్కొంది.

శరీరంలోకి అధిక మొత్తంలో అల్యూమినియం చేరడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ లోహాన్ని బయటకు పంపే ప్రక్రియలో కిడ్నీలపై భారం పడి అవి దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, మతిమరుపు, నరాల బలహీనత, ఎముకలు గుల్లబారడం, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. వీటికి బదులుగా స్టీల్, మట్టి లేదా ఇనుప పాత్రలను వంటకు ఉపయోగించడం సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు.