మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అమర్‌కంటక్‌లో ఉన్న నర్మదా ఆలయంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలోని ఏనుగు విగ్రహం కింద నుంచి దూరేందుకు ప్రయత్నించిన ఓ భక్తుడు మధ్యలోనే ఇరుక్కుపోయి తీవ్ర అవస్థలు పడ్డాడు. తోటి భక్తులు ఎంతో శ్రమించి అతడిని బయటకు తీశారు. 

ఆలయ ప్రాంగణంలో ఉన్న నల్లటి రాతి ఏనుగు, గుర్రం విగ్రహాల కాళ్ల మధ్య నుంచి సులభంగా అవతలి వైపునకు వెళితే కోరికలు నెరవేరుతాయని కొందరు భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అంతేకాదు, ఇది తమ పాపపుణ్యాలకు ఒక పరీక్ష అని, పాపాలు తక్కువగా ఉన్నవారే సులభంగా బయటకు వస్తారని వారి విశ్వాసం. ఈ నమ్మకంతోనే సదరు భక్తుడు ఏనుగు విగ్రహం కింద దూరే ప్రయత్నం చేశాడు. అయితే, శరీరం మధ్యలోకి రాగానే ముందుకు, వెనక్కి కదలలేక అందులోనే చిక్కుకుపోయాడు.

దీంతో ఆందోళనకు గురైన అతడిని చూసి, తోటి భక్తులు వెంటనే స్పందించారు. కాసేపు శ్రమించి, అతడిని జాగ్రత్తగా బయటకు లాగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆశ్చర్యకరంగా, ఈ ఘటన తర్వాత కూడా కొందరు యథావిధిగా విగ్రహం కింద నుంచి వెళ్లడం వీడియోలో కనిపించింది. కాగా, ఈ ఘటన కచ్చితంగా ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత లేదు కానీ, నవంబర్ నెలలో ఈ వీడియో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.

ఇటీవలే అరుణాచలంలో విషాదం
ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ, మూఢ నమ్మకాలతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలుకుతున్నారు. ఇలాంటి ఇరుకైన మార్గాల్లో దూరే ప్రయత్నం చేయడం వల్ల తీవ్ర గాయాలు కావడం లేదా ఊపిరాడక ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇటీవల తమిళనాడులో చోటుచేసుకుని, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.

ఈ ఏడాది జులై 24న తిరువణ్ణామలైలోని అరుణాచలం గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయంలో ఇలాంటి దుర్ఘటనే జరిగింది. రాజమండ్రికి చెందిన మణికుమార్ (36) అనే భక్తుడు, 'మోక్ష మార్గం'గా పిలిచే ఓ ఇరుకైన ప్రదేశం నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలో చిక్కుకుపోయాడు. ఊపిరి అందకపోవడంతో స్పృహ కోల్పోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఆ విషాదం తర్వాత ఆలయ అధికారులు మేల్కొని, అధిక బరువు ఉన్నవారు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఆ మార్గంలోకి ప్రవేశించవద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అమర్‌కంటక్ ఘటన నేపథ్యంలోనైనా ఇలాంటి ప్రమాదకరమైన ఆచారాలపై భక్తులు పునరాలోచించుకోవాలని పలువురు సూచిస్తున్నారు.