ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ తన దివంగత కుమార్తె మీరా జ్ఞాపకాలతో జీవిస్తున్న తీరును ఆయన భార్య ఫాతిమా భావోద్వేగపూరితంగా పంచుకున్నారు. కుమార్తె మరణం తర్వాత తొలిసారిగా ఒక సినిమా వేడుకకు హాజరైన ఆమె, వేదికపై కన్నీటిపర్యంతమయ్యారు. తన కూతురి స్మృత్యర్థం విజయ్ ఆంటోనీ తీసుకున్న నిర్ణయాలు అందరినీ కలిచివేస్తున్నాయి.

‘అప్పా కుట్టి’ అనే తమిళ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఫాతిమా మాట్లాడుతూ.. "మీరా కోసం కొన్న చెప్పులు, షూలతో ఇంట్లో ఒక గది నిండిపోయింది. వాటిలో కొన్ని ఆమె ఉన్నత చదువుల కోసం విదేశాల నుంచి తెప్పించినవి కూడా ఉన్నాయి. ఆ గదిని చూసినప్పటి నుంచి విజయ్ ఆంటోనీ పాదరక్షలు ధరించడం పూర్తిగా మానేశారు. కేవలం వృత్తిపరమైన అనివార్య కారణాల వల్ల మాత్రమే అప్పుడప్పుడు వేసుకుంటున్నారు" అని వివరించారు. అంతేకాకుండా, విజయ్ వద్ద ఎన్నో ఖరీదైన వాచీలు ఉన్నప్పటికీ, మీరాను చివరిసారి చూసినప్పుడు ఆమె చేతికి ఉన్న వాచ్‌నే ఆయన నిత్యం ధరిస్తున్నారని ఫాతిమా తెలిపారు.

ఈ సందర్భంగా తన భర్త గురించి ప్రస్తావిస్తూ.. తనకు ఏడేళ్ల వయసులోనే తండ్రి దూరమయ్యారని, ఆ తండ్రి ప్రేమను విజయ్ ఆంటోనీలో చూసుకున్నానని ఆమె పేర్కొంది.

ము. మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ, ప్రీతి అస్రాని జంటగా నటించిన 'అప్పా కుట్టి' చిత్రం తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రం నేడు (20న) విడుదల కానుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తమ తండ్రికి ఫోన్ చేయాలనిపిస్తుందని విజయ్ ఆంటోనీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. ఈ కార్యక్రమానికి ఆయన చిన్న కుమార్తె లారా కూడా హాజరైంది. గత ఏడాది సెప్టెంబర్‌లో విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకున్నారు.