కొబ్బరికాయ పండు కాదని, అది నూనెగింజ కిందకే వస్తుందని అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం స్పష్టం చేసింది. అందువల్ల పండ్లు, కూరగాయల కోసం కేటాయించిన ప్రత్యేక మార్కెట్లలో కొబ్బరికాయలను విక్రయించడానికి అనుమతించలేమని తేల్చిచెప్పింది.

ఘజియాబాద్‌కు చెందిన ‘మెసర్స్ త్రీ స్టార్ ఫ్రూట్ కంపెనీ’ సాహిబాబాద్‌లోని పండ్లు, కూరగాయల మార్కెట్లో కొబ్బరికాయలు విక్రయించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అలోక్ మాథుర్, జస్టిస్ అమితాబ్ కుమార్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. ఉత్తరప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ చట్టం-1964 కింద కొబ్బరిని వ్యవసాయ నూనెగింజగా వర్గీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 1995 జనవరి 30న తీసుకొచ్చిన సవరణను కోర్టు సమర్థించింది.

వృక్షశాస్త్రం ప్రకారం పచ్చి కొబ్బరి పండుగా కనిపించినప్పటికీ, వాణిజ్యపరంగా చూస్తే కొబ్బరి నుంచి నూనె తీసేందుకు కొబ్బరి ఎండు చిప్పలను (కొప్రా) విస్తృతంగా వాడతారని ధర్మాసనం అభిప్రాయపడింది. కేవలం పచ్చి కొబ్బరిని పండులా తింటారనే కారణంతో మొత్తం కేటగిరీని పండుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. గతంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల వ్యాపారులకు అక్కడ విక్రయించే శాశ్వత హక్కు లభించదని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

యూజర్ ఛార్జీలు చెల్లించడానికి సిద్ధపడినా కూడా కూరగాయల మార్కెట్లో కొబ్బరి విక్రయాలకు అనుమతి ఉండదని కోర్టు స్పష్టం చేసింది. వ్యాపారులు గోవింద్‌పురంలోని ఆహార ధాన్యాల మార్కెట్‌లో నిర్ణీత రుసుములు చెల్లించి కొబ్బరిని అమ్ముకోవచ్చని సూచించింది.