ప్రముఖ డెయిరీ దిగ్గజాలు అమూల్, మదర్ డెయిరీ వినియోగదారులకు మరోసారి ధరల షాక్ ఇచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో ఈ రెండు సంస్థలు రిటైల్ పాల ధరలను రెండోసారి పెంచాయి. దీంతో ఈ ఏడాది మొత్తం మీద లీటరు పాలపై రూ. 4 నుంచి రూ. 8 వరకు భారం పెరిగింది.

మే 2026లో లీటరుపై రూ. 2 పెంచిన ఈ సంస్థలు, తాజాగా నవంబర్ 2026లో మరో రూ. 2 నుంచి రూ. 6 వరకు ధరలను సవరించాయి. సాధారణంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉండే శీతాకాలం (ఫ్లష్ సీజన్)లో పాల ఉత్పత్తి పెరిగి, సరఫరా మెరుగ్గా ఉంటుంది. అలాంటి సమయంలో ధరలు పెరగడం చాలా అరుదు. అయితే ఈసారి పరిస్థితులు భిన్నంగా మారడంతో డెయిరీ సంస్థలు ధరలు పెంచక తప్పలేదని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది.

ధరల పెంపునకు ప్రధాన కారణాలు:

కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ నివేదిక ప్రకారం పాల ధరల పెరుగుదలకు పలు అంశాలు కారణమయ్యాయి:
పాల సరఫరా కొరత: దేశీయంగా పాల సరఫరా తగ్గడంతో పాటు ప్రతి 3 నుంచి 4 సంవత్సరాలకు ఒకసారి సహజంగా వచ్చే పశువుల ఉత్పాదకత మందగమనం (బయోలాజికల్ డిప్) ఇందుకు కారణమైంది.
పాల నాణ్యత: కొన్ని పాల సేకరణ ప్రాంతాల్లో పాలలోని ఫ్యాట్ (వెన్న శాతం) తగ్గడం ప్రభావం చూపింది.
పెరిగిన నిర్వహణ ఖర్చులు: పశుగ్రాసం, దాణా ధరలు గణనీయంగా పెరగడంతో పాడి రైతులకు ఉత్పత్తి వ్యయం అధికమైంది.
ఎస్ఎంపీ ధరల పెరుగుదల: అంతర్జాతీయ మార్కెట్లో స్కిమ్డ్ మిల్క్ పౌడర్ (ఎస్ఎంపీ) ధరలు భారీగా పెరిగాయి. అక్టోబర్ 2026 నాటికి అంతర్జాతీయంగా ఎస్ఎంపీ ధర టన్నుకు 3,800 డాలర్లను దాటింది. ఇది గతేడాదితో పోలిస్తే దాదాపు 36 శాతం ఎక్కువ. దీని ప్రభావంతో దేశీయ మార్కెట్లో ఎస్ఎంపీ, వెన్న నిల్వలు సాధారణ స్థాయి కంటే తక్కువగా నమోదవుతున్నాయి.

డెయిరీ రంగంలో భవిష్యత్ అంచనాలు:

2025–26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ పాల ఉత్పత్తి 3.6 శాతం వృద్ధితో దాదాపు 256.8 మిలియన్ టన్నులకు చేరినప్పటికీ, సరఫరా సమస్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని మార్కెట్ మిగులు పాలలో వ్యవస్థీకృత డెయిరీ రంగం వాటా కేవలం 30 నుంచి 35 శాతంగానే ఉంది.

ఈ క్రమంలో వ్యవస్థీకృత డెయిరీ రంగ సంస్థలు 2026–27 నుంచి 2028–29 ఆర్థిక సంవత్సరాల మధ్య సుమారు రూ. 15,000 కోట్లకు పైగా మూలధన వ్యయం (క్యాపెక్స్) చేయాలని యోచిస్తున్నాయి. ముఖ్యంగా విలువ ఆధారిత ఉత్పత్తుల (Value-added products) తయారీపై దృష్టి పెడుతున్నాయి. ఈ భారీ పెట్టుబడుల ద్వారా మధ్యకాలికంగా రూ. 40,000 కోట్లకు పైగా అదనపు ఆదాయం లభించే అవకాశముందని నివేదిక స్పష్టం చేసింది.