తెలుగువారి ఇళ్లలో గర్భిణులకు సంప్రదాయబద్ధంగా ‘సీమంతం’ చేయడం ఆనవాయతీ. అయితే సినీ నటి సమంత కోసం అత్తగారింట్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సమంత భర్త రాజ్ నిడిమోరు సోదరి శీతల్ నిడిమోరు సామాజిక మాధ్యమాల్లో ఈ పూజ గురించి పోస్ట్ చేయడంతో.. అసలు ఈ సంప్రదాయ పూజ విశేషాలేంటి? దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? అనే దానిపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

ఏంటీ పూజ?
సమంత, రాజ్‌ కలిసి చేసిన ఈ పూజ 'మాతృ శిశు మంగళ ఆశీర్వాదం' అని శీతల్‌ తెలిపింది. సాధారణంగా చేసే వేడుకల్లో విందులు, వినోదాలు ప్రధానంగా కనిపిస్తుంటాయి. కానీ ఇది పూర్తిగా ఆధ్యాత్మిక, వైదిక సంప్రదాయాలతో కూడిన ఒక ప్రత్యేక పూజా విధానం. కాబోయే తల్లి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటం, గర్భంలోని శిశువుకు సానుకూల తరంగాలను అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ క్రతువులో భాగంగా గర్భిణీకి, పుట్టబోయే బిడ్డకు ఎలాంటి దోషాలు లేకుండా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ వేద మంత్రాలతో దేవతలను ఆరాధిస్తారు.

పూజలో ఏం చేశారు?
ఈ ఆశీర్వాద క్రతువులో అత్యంత పవిత్రమైన శ్రీసూక్తం, గాయత్రీ దేవి హోమాలు నిర్వహించారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శ్రీసూక్త పారాయణం, సకల శక్తుల మూలమైన గాయత్రీ మంత్రాన్ని 21 సార్లు జపిస్తూ ఆహుతులు సమర్పించారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఒకే చోట కూర్చుని భగవంతుడిని ప్రార్థించడం ద్వారా ఆ ఇంట్లో ఒక దివ్యమైన వాతావరణం ఏర్పడుతుంది. పుట్టబోయే బిడ్డకు సంస్కారం, సంకల్ప బలం, మంచి నడవడిక అలవడాలని కోరుకుంటూ పెద్దలు వేదోక్తంగా దీవెనలు అందజేశారు.

అనుబంధాల కలయిక
ఈ పూజ కేవలం ఒక పూజా విధానం మాత్రమే కాదు, బంధాలను మరింత బలోపేతం చేసే ఆధ్యాత్మిక వేదిక. దూరం నుంచి వచ్చిన కుటుంబ పెద్దలు, రాజ్ పిన్నమ్మలు, పెద్దమ్మ అంతా చేరి సమంతను మనసారా ఆశీర్వదించారు. సంగీత విద్వాంసులైన పద్మశ్రీ శోభారాజు, పద్మశ్రీ సుమిత్రా గుహ వంటి వారు ప్రత్యేకంగా స్వరపరచిన రాగాలతో గీతాలను ఆలపించడం ఈ క్రతువును మరింత ప్రత్యేకం చేసింది. ఆధునిక హంగుల కంటే శాస్త్రోక్తమైన ప్రార్థనల ద్వారా తల్లికి, బిడ్డకు రక్షణ కల్పించాలనే సంకల్పంతోనే ఈ ‘మాతృ శిశు మంగళ ఆశీర్వాదం’ నిర్వహించారు.