రేపు భారత్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్ కోసం న్యూజిలాండ్ జట్టు తమ బౌలింగ్ వ్యూహాన్ని ఖరారు చేసింది. ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లతో పాటు ఒక బౌలింగ్ ఆల్ రౌండర్‌ను బరిలోకి దించనున్నట్లు న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ స్పష్టం చేశాడు. దాదాపు ఆరు నుంచి ఏడు వారాల పాటు సాగే ఈ పర్యటనలో బౌలర్ల పనిభారం (వర్క్‌లోడ్), మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ముందుకెళతామని లాథమ్ తెలిపాడు.

మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో లాథమ్ మాట్లాడుతూ.. "మేం ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఒక బౌలింగ్ ఆల్ రౌండర్‌తో బరిలోకి దిగుతున్నాం. మా ఫాస్ట్ బౌలర్లలో చాలామంది పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడం మా అదృష్టం. రాబోయే మ్యాచ్‌లలో ఎవరు ఆడతారనేది ముందే పక్కాగా నిర్ణయించడం కష్టం. రాబోయే ఆరు, ఏడు వారాల్లో పరిస్థితులు, వర్క్‌లోడ్‌ను బట్టి వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటాం. అయితే, ప్రస్తుతం మా దృష్టి మొత్తం తొలి టెస్టుపైనే ఉంది" అని వివరించాడు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టిక గురించి తాము ఎక్కువగా ఆలోచించడం లేదని లాథమ్ తేల్చిచెప్పాడు. "డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్ నా ప్రధాన దృష్టి కాదు. మన నియంత్రణలో ఉన్న అంశాలపైనే మేం దృష్టి పెడతాం. మా సొంత శైలిలోనే క్రికెట్ ఆడి, విజయానికి గల అవకాశాలను పెంచుకుంటాం" అని ఆయన పేర్కొన్నాడు.

భారత పేస్ దళపతి జస్ప్రీత్ బుమ్రా వల్ల తమకు గట్టి సవాల్ ఎదురుకానుందని న్యూజిలాండ్ సారథి అంగీకరించాడు. బుమ్రా బౌలింగ్ శైలి విలక్షణమైనదని, ఏ పిచ్‌పై అయినా బంతిని కదిలించగల సత్తా అతనికి ఉందని కొనియాడాడు. "బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్. మా జట్టులోని చాలామంది ఆటగాళ్లు అతడిని టెస్టుల్లో లేదా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎదుర్కొన్నాడు. అతడి బౌలింగ్ యాక్షన్ చాలా విభిన్నంగా ఉంటుంది. ఇక్కడి పిచ్‌లపై అతడిని ఎదుర్కోవడం మా బ్యాటర్లకు పెను సవాలే. అతడితో పాటు మిగతా భారత బౌలర్లను కూడా సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళికలతో సిద్ధమయ్యాం. మా సన్నాహాలు సంతృప్తికరంగా సాగాయి, మ్యాచ్‌లో చక్కటి ఆరంభాన్ని అందుకుంటామని ఆశిస్తున్నాం" అని లాథమ్ చెప్పాడు.

ఇదే సమయంలో తమ జట్టులోని ప్రధాన పేసర్ మాట్ హెన్రీ అనుభవం, నిలకడ గురించి లాథమ్ ప్రస్తావించాడు. పిచ్‌తో సంబంధం లేకుండా నిలకడగా వికెట్లపైకి బంతులు విసరడం, కాస్త కదలిక రాబట్టడం అతని ప్రత్యేకత అని తెలిపాడు. గత మూడు నాలుగేళ్లుగా అతను తమ పేస్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న తీరు అద్భుతమని మెచ్చుకున్నారు. గాయాల నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చి, సుదీర్ఘ ఫార్మాట్‌కు సిద్ధమైన తీరు జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని లాథమ్ వెల్లడించాడు. తొలి మ్యాచ్ నుంచే పక్కా ప్రణాళికతో టీమిండియాను కట్టడి చేసేందుకు కివీస్ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు.