ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను ఉద్దేశించి సాక్షి మీడియా ప్రచురించిన కథనంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దలను శుభకార్యానికి పిలవడం మన సంస్కృతి అని, అలాంటి అంశంపై ఒక మహిళను కించపరిచేలా కథనాలు రాయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా సాక్షి తీరును తీవ్రంగా తప్పుపడుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.

కుటుంబంలో జరిగే పెళ్లి వేడుకకు పెద్దలను ఆహ్వానించడం కనీస మర్యాద, మన సంప్రదాయమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబును వైఎస్ షర్మిల స్వయంగా కలిసి ఆహ్వాన పత్రిక ఇవ్వడంపై సాక్షి మీడియా ఇచ్చిన కథనం ఒక మహిళ ఆత్మగౌరవాన్ని దిగజార్చేలా ఉందని మండిపడ్డారు. ఇలాంటి బాధ్యతారాహిత్య కథనాలను సమాజం ఎప్పటికీ ఆమోదించదని అన్నారు.

ప్రజా జీవితంలో రాజకీయంగా ఎన్ని తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ, సమాజంలో ఉండే ప్రాథమిక మానవ విలువలను ఎట్టిపరిస్థితుల్లోనూ కోల్పోకూడదని లోకేశ్ హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మహిళపై ఇలా వ్యక్తిగత దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని, ఇలాంటి సంస్కృతికి ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి తావు లేదని ఆయన స్పష్టం చేశారు. బాధ్యతారహితంగా వ్యవహరించిన సాక్షి మీడియా వైఖరిని గట్టిగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో, ఈ శుభకార్యం సందర్భంగా వైఎస్ షర్మిలకు, ఆమె కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేశ్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, సాక్షి కథనంపై తీవ్ర మనస్తాపానికి గురైన వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆవేదనాభరిత ట్వీట్‌ను కూడా లోకేశ్ తన పోస్టులో పంచుకున్నారు.