విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కైలాసగిరిలో అత్యాధునిక రోప్‌వే నిర్మాణానికి మార్గం సుగమమైంది. దాదాపు ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తున్న టెండర్ల ప్రక్రియ ఎట్టకేలకు ఖరారైంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) నిర్వహించిన తాజా బోర్డు సమావేశంలో ఈ ప్రాజెక్టు పనుల కేటాయింపునకు ఆమోదం లభించింది. టెండర్లలో ఎల్‌-1గా నిలిచిన ప్రస్తుత రోప్‌వే కాంట్రాక్టర్‌కే ఈ కొత్త ప్రాజెక్టు బాధ్యతలను అప్పగించారు.

కైలాసగిరిపై 2004లో ఏర్పాటు చేసిన ప్రస్తుత రోప్‌వే తన 20 ఏళ్ల కాలపరిమితిని పూర్తి చేసుకుంది. దీంతో పాత రోప్‌వేను పూర్తిగా తొలగించి, దాని స్థానంలో సరికొత్త సాంకేతికతతో కూడిన రోప్‌వేను నిర్మించనున్నారు. ఈ కొత్త మార్గం కొండపై నుంచి తెలుగు మ్యూజియం వరకు దాదాపు 1.5 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంటుంది. దీనికి అదనంగా, అంతర్జాతీయ స్థాయిలో సింగపూర్ తరహాలో సుమారు 600 మీటర్ల పొడవున 'లూజ్ గ్రావిటీ రైడ్'ను కూడా పర్యాటకుల కోసం ఏర్పాటు చేయనున్నారు. శివపార్వతుల విగ్రహం సమీపంలో ఈ సాహసోపేత రైడ్ అందుబాటులోకి రానుంది.

ఈ సందర్భంగా వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ... కైలాసగిరిని పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మార్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. అందుకే రోప్‌వేను అక్కడి వరకు పొడిగించామన్నారు. విశాఖపట్నం ప్రజలకు లూజ్‌ గ్రావిటీ రైడ్‌ పరిచయం చేస్తామని తెలిపారు.

శీతాకాలం కావడంతో విశాఖతో పాటు అరకు, లంబసింగి ప్రాంతాలకు పర్యాటకుల రాక గణనీయంగా పెరిగింది. ఈ తరుణంలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగవంతం చేస్తోంది. కాంట్రాక్ట్ సంబంధిత అధికారిక పత్రాల అప్పగింత పూర్తయిన వెంటనే క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.