ఐర్లాండ్‌లోని షానన్ విమానాశ్రయంలో పార్క్ చేసిన అమెరికా సైనిక విమానంలోకి ఓ వ్యక్తి గొడ్డలితో చొరబడి తీవ్ర విధ్వంసం సృష్టించాడు. సుమారు 60 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.500 కోట్లు) విలువైన యూఎస్ ఎయిర్ నేషనల్ గార్డ్ సి-130 హెర్క్యులస్ రవాణా విమానాన్ని పనికిరాకుండా నాశనం చేశాడు. అమెరికా ప్రభుత్వం మోపిన అభియోగాల పత్రం ప్రకారం.. నిందితుడు డైతీ ఓ కోరైన్ (48) ఏప్రిల్ 11న ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు వేకువజామున 4:40 గంటలకు విమానాశ్రయ భద్రతా వలయాన్ని దాటుకుని లోపలికి ప్రవేశించాడు. ట్యాక్సీవేపై నిలిపిన విమానం వెనుక డోర్ లాకింగ్ వ్యవస్థను పగలగొట్టి లోపలికి వెళ్లాడు. సిబ్బంది వినియోగించే వస్త్రాలతో కిటికీలను మూసివేసి, ఎవరూ రాకుండా తలుపులకు బోల్టులు, గమ్‌ వేసి బిగించాడు. దాదాపు ఐదు గంటల పాటు విమానంలోనే ఉంటూ ఎలక్ట్రికల్ వైర్లు, హైడ్రాలిక్ పైపులు, ఆక్సిజన్ గొట్టాలను గొడ్డలితో తెగ్గొట్టాడు. కాక్‌పిట్‌లోని మీటర్లు, స్క్రీన్లను పూర్తిగా పగులగొట్టాడు.

ఉదయం 9:40 గంటల సమయంలో నిందితుడు కాక్‌పిట్ అద్దం గుండా సిబ్బంది కంటపడ్డాడు. రూఫ్ హ్యాచ్ నుంచి బయటకు వచ్చి విమానం పైకప్పుపై గొడ్డలితో దాడి చేస్తుండగా భద్రతా సిబ్బంది గమనించారు. ఇంధన ట్యాంకుల్లో ఇనుప గుండ్లు, అనుమానాస్పద పదార్థాలు పోస్తున్న సమయంలో అతడిని ఐర్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇది హఠాత్తుగా చేసిన పని కాదని, నెలల తరబడి పక్కా ప్రణాళికతోనే చేశాడని ఎఫ్‌బీఐ తేల్చింది. నిందితుడు సైనిక విమానాల కదలికలను ట్రాక్ చేసే యాప్‌లు, లోహాన్ని కరిగించే రసాయనాల కోసం ముందే ఆరా తీసినట్లు గుర్తించారు. అమెరికా విదేశాంగ విధానాలు, ఇజ్రాయెల్, ఇరాన్ వివాదాలపై నిరసనగా ఈ చర్యకు పాల్పడినట్లు నిందితుడి మద్దతుదారులు చెబుతున్నారు. విమానాన్ని శాశ్వతంగా ఎగరలేని స్థితికి చేర్చడంతో అమెరికాలో అతడిపై ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం కింద కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.