ఏలూరు జిల్లాలో గత ఆరు నెలలుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పెద్దపులి సంచారం కొనసాగుతూనే ఉంది. పలు మండలాలను చుట్టివచ్చిన ఈ పులి, తాజాగా లింగపాలెం మండలం సింగగూడెం శివారులోని మల్లేశ్వరం ప్రాంతానికి చేరుకుంది. ప్రస్తుతం అక్కడి మామిడితోటలో మకాం వేసినట్టు అధికారులు గుర్తించారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

సోమవారం రాత్రి ఈ పులి చాట్రాయి మండలంలోకి ప్రవేశించడంతో ఆ ప్రాంత ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. పులి కదలికల సమాచారం అందుకున్న అటవీ, పోలీసు శాఖల అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. పులి మెడకు అమర్చిన జీపీఎస్ ట్రాకర్ సిగ్నల్స్ ఆధారంగా దాని కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

చింతలపూడి మండలం నుంచి చాట్రాయి మీదుగా పులి లింగపాలెం మండలం మల్లేశ్వరానికి చేరినట్టు ఏలూరు రేంజ్ ఆఫీసర్ ఎస్‌వీకే కుమార్ ధ్రువీకరించారు. సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో చింతలపూడి మండలంలోని చింతంపల్లి, రాఘవాపురం, డీఎన్‌ రావుపేట, పోతునూరు గ్రామాల మీదుగా ప్రయాణించి చాట్రాయి మండలంలోకి ప్రవేశించిందని, అక్కడి నుంచి మల్లేశ్వరం చేరుకుందని ఆయన వివరించారు. తొలుత వేలేరుపాడు, జీలుగుమిల్లి, చింతలపూడి మండలాల్లో సంచరించిన ఈ పులి ఇప్పుడు లింగపాలెం పరిధిలోకి రావడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.