అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసి సంచలనం సృష్టించిన నిందితుడు హేమంత్‌ను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్) నుంచి నేడు (బుధవారం) డిశ్చార్జ్ చేస్తున్నారు. పోలీసు కాల్పుల్లో గాయపడిన అతడికి కోర్టు ఆదేశాల మేరకు కర్నూలు ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించారు.

గత నాలుగు రోజులుగా కార్డియాలజీ ఐసీయూలో చికిత్స పొందిన హేమంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడి బీపీ, పల్స్ రేటు సాధారణ స్థితికి వచ్చాయని, కాలికి అయిన గాయం కూడా పూర్తిగా మానిందని ఆయన వెల్లడించారు. హేమంత్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలతో ఒక నివేదికను రూపొందించి అనంతపురం జిల్లా న్యాయాధికారికి పంపనున్నట్లు వివరించారు. ఆరోగ్యం కుదుటపడటంతో నేడు డిశ్చార్జ్ చేసి, నిందితుడిని అనంతపురం జిల్లా జైలు అధికారులకు అప్పగించనున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు.