భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ తన ఐపీఎల్ ప్లేయింగ్ కెరీర్‌కు ముగింపు పలికారు. 2027 సీజన్ నుండి ఆయన సీఎస్‌కే జట్టుకు మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నట్లు ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఈ కీలక పరిణామంపై ధోనీ భార్య సాక్షి మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక భావోద్వేగభరితమైన సందేశాన్ని పంచుకున్నారు.

"కొన్ని అద్భుతమైన కొత్త అధ్యాయాలు ప్రారంభం కావాలంటే, పాతవి ముగియక తప్పదు" అని సాక్షి తన పోస్టులో పేర్కొన్నారు. "ఇన్నేళ్లుగా మహీని ఆదరించి, మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు మాకు వ్యక్తిగతంగా తెలిసినా, తెలియకపోయినా.. మీరు చూపిన ఈ అపారమైన ప్రేమకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. కొత్త ఆరంభాలు, సరికొత్త సాహసాలు, మరెన్నో మధుర జ్ఞాపకాల కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మహీ, నిన్ను చూసి నేను ఎంతో గర్వపడుతున్నాను" అని ఆమె రాసుకొచ్చారు.

ఈ సందేశంతో పాటు, పర్వత శ్రేణులను వీక్షిస్తున్న ధోనీకి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ను కూడా ఆమె జత చేశారు. దీనికి 'ఆల్డ్ లాంగ్ సైన్' అనే ప్రసిద్ధ గీతాన్ని నేపథ్య సంగీతంగా జోడించగా, ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్‌గా మారింది.

ఐపీఎల్ రిటెన్షన్ గడువు ముగిసిన నేపథ్యంలో సీఎస్‌కే ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ధోనీ చెన్నై జట్టుతోనే అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. అతడి అద్భుతమైన సారథ్యంలో సీఎస్‌కే ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తాజా ప్రకటనతో దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ధోనీ సుదీర్ఘ ఐపీఎల్ ప్లేయింగ్ కెరీర్‌కు తెరపడినట్లయింది.