భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సారథి, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన అద్భుతమైన ఐపీఎల్ కెరీర్‌కు ఆయన ముగింపు పలికారు. ధోనీ రిటైర్మెంట్ వార్తతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైంది. మాజీ సహచరులు, ప్రత్యర్థి జట్ల క్రీడాకారులు, వివిధ ఐపీఎల్ ఫ్రాంచైజీలు, క్రికెట్ పాలకులు ఆయన నాయకత్వ పటిమను, మైదానంలో చూపిన సంయమనాన్ని గుర్తుచేసుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు.

ధోనీ నిర్ణయంపై మాజీ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ స్పందిస్తూ.. తన అంతర్జాతీయ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో ధోనీ పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. ధోనీ చేతుల మీదుగానే తాను టీమిండియా అరంగేట్ర క్యాప్ అందుకున్నానని గుర్తుచేసుకున్నారు. "నాకు ఇండియా క్యాప్ ఇచ్చిన ఆ క్షణాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను. మీ మార్గదర్శకత్వం, నాపై ఉంచిన నమ్మకం నా ప్రయాణంలో ఎంతో కీలకమైనవి. థాంక్యూ మహి భాయ్. మీ వారసత్వం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. మీకు కొత్తేమీ కాని ఈ పాత్రలో, సీఎస్‌కేతో సరికొత్త అధ్యాయానికి ఆల్ ది బెస్ట్" అని చహల్ పేర్కొన్నారు.

సీఎస్‌కే మాజీ ఆటగాడు దీపక్ చాహర్ సైతం ధోనీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. "ప్రేరణ, వినోదం, విలువైన మార్గదర్శకత్వం అందించినందుకు ధన్యవాదాలు మహి భాయ్. మళ్లీ మిమ్మల్ని మైదానంలో ఆటగాడిగా చూడలేకపోవడం కష్టమే అయినప్పటికీ, క్రికెట్ కోసం మీరు సర్వస్వం ధారపోశారు. మీ ప్రయాణంలో భాగం కావడం, మిమ్మల్ని ఇంత దగ్గరగా చూడటం నా అదృష్టం. నా కెరీర్‌లో మీరు అందించిన నిరంతర మద్దతుకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీ కొత్త ఇన్నింగ్స్‌కు శుభాకాంక్షలు" అని చాహర్ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. మరోవైపు, సీఎస్‌కే స్టార్ రవీంద్ర జడేజా 2023 ఐపీఎల్ విజయం తర్వాత ధోనీని ఎత్తుకున్న ఫొటోను షేర్ చేస్తూ, ‘8 కా 7 కే లియే రెస్పెక్ట్ ఫరెవర్’ అంటూ గౌరవాన్ని చాటుకున్నారు. అలాగే డ్వేన్ బ్రావో "థాంక్యూ స్కిప్పర్.. మీ వారసత్వం శాశ్వతంగా నిలిచి ఉంటుంది" అని పేర్కొన్నారు.

ధోనీ రిటైర్మెంట్‌పై ఐపీఎల్ అధికారికంగా స్పందిస్తూ, లీగ్‌ను అత్యంత ప్రత్యేకంగా మార్చినందుకు ధన్యవాదాలు తెలిపింది. మెంటార్‌గా రానున్న ధోనీకి స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. స్టేడియంలలో అభిమానులు ధోనీకి నీరాజనాలు పలికిన దృశ్యాలతో కూడిన వీడియోను పంచుకుంటూ, ఆయనను ‘ఎప్పటికీ ఒక ఎమోషన్’గా అభివర్ణించింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) విరాట్ కోహ్లీతో ధోనీ ఉన్న ఫొటోను పంచుకుంటూ.. "రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం, ట్రోఫీలతో కూడిన వారసత్వం, అద్భుతమైన క్షణాలు, చిరస్మరణీయ లాస్ట్ బాల్ ఫినిషింగ్‌లు, ఎన్నడూ చెదరని ప్రశాంతత.. అభిమానులకు అందించిన ఆనందానికి ధన్యవాదాలు మహి భాయ్" అని పేర్కొంది.

ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ధోనీ, రోహిత్ శర్మ కలిసి టాస్ వేస్తున్న ఫొటోను షేర్ చేస్తూ, చెరో ఐదు ట్రోఫీలు గెలిచిన కెప్టెన్ల మధ్య సాగిన రసవత్తర పోరాటాలను గుర్తుచేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ "తల శకం ఎప్పటికీ ముగియదు, కేవలం పాత్ర మాత్రమే మారుతుంది" అని పేర్కొనగా.. ధోనీ లేని ఐపీఎల్ మునుపటిలా ఉండబోదని ఢిల్లీ క్యాపిటల్స్ వ్యాఖ్యానించింది.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ధోనీకి ఘనంగా వీడ్కోలు పలికారు. ధోనీ చెన్నై నగరానికి కేవలం ట్రోఫీలను మాత్రమే కాకుండా, తరాలను ఏకం చేసిన గొప్ప భావోద్వేగాన్ని అందించారని కొనియాడారు. "క్రికెట్‌ను మించిన అనుబంధాన్ని ధోనీ నిర్మించారు. ప్రతి మంచి విషయానికీ ముగింపు తప్పదు. తమిళనాడు దత్తపుత్రుడికి ఘన వీడ్కోలు పలికే అవకాశం చివరిసారి దక్కి ఉంటే బాగుండేది. సీఎస్‌కే మెంటార్‌గా మీ సరికొత్త ఇన్నింగ్స్‌కు శుభాకాంక్షలు" అని స్టాలిన్ రాసుకొచ్చారు.

తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) ధోనీని అద్భుతమైన లీడర్, ఫినిషర్, భారత క్రికెట్‌పై బలమైన ముద్ర వేసిన మహోన్నత వ్యక్తిగా అభివర్ణించింది. ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధావన్ సైతం ధోనీ గొప్పతనాన్ని కొనియాడారు. మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా "ఒక శకం ముగిసింది.. మహి లేని ఐపీఎల్ మునుపటిలా ఉండదు" అని పేర్కొన్నారు.

మహేంద్ర సింగ్ ధోనీ తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 278 మ్యాచులు ఆడి 5,439 పరుగులు సాధించారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఐదుసార్లు ఐపీఎల్ టైటిళ్లను అందించారు. ఆటగాడిగా మైదానాన్ని వీడినప్పటికీ, 2027 సీజన్ నుంచి ఆయన చెన్నై సూపర్ కింగ్స్ మెంటార్‌గా కొనసాగుతూ జట్టును ముందుండి నడిపించనున్నారు.