ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన ఐకానిక్ మోటార్‌సైకిల్ పల్సర్ 180ని భారత మార్కెట్ నుంచి మరోసారి నిలిపివేసింది. నాలుగేళ్ల విరామం తర్వాత ఏప్రిల్ 2026లో తిరిగి ప్రవేశపెట్టిన ఈ బైక్, సరిగ్గా ఆరు నెలలు తిరిగేసరికి అధికారిక వెబ్‌సైట్ నుంచి అదృశ్యమైంది. గత ఐదేళ్ల వ్యవధిలో ఈ మోడల్‌ను మార్కెట్ నుంచి తప్పించడం ఇది రెండోసారి. అధికారికంగా బజాజ్ ఎలాంటి ప్రకటన విడుదల చేయనప్పటికీ, కంపెనీ అధికారిక పోర్టల్‌లోని 'ఒరిజినల్' విభాగం నుంచి పల్సర్ 180ను పూర్తిగా తొలగించారు.

రూ.1.22 లక్షల (ఎక్స్-షోరూమ్) ఆకర్షణీయ ధరతో బజాజ్ ఈ బైక్‌ను ఏప్రిల్‌లో మార్కెట్లోకి తీసుకొచ్చింది. మార్కెట్లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు నమోదు కాకపోవడమే ఈ ఆకస్మిక నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. అమ్మకాలు తగ్గితే మోడళ్లను పక్కన పెట్టే వ్యూహాన్ని అనుసరించే బజాజ్, గత జూన్‌లో ఎన్125ను తొలగించినట్లే ఇప్పుడు 180ని కూడా సైలెంట్‌గా పక్కకు తప్పించింది. ప్రస్తుతం వెబ్‌సైట్‌లో పల్సర్ 125, 150, 220ఎఫ్ మోడళ్లు కొనసాగుతున్నాయి.

ఈ మోటార్‌సైకిల్‌లో 178.6 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 8,500 ఆర్‌పీఎమ్ వద్ద 17 హెచ్‌పీ పవర్, 6,500 ఆర్‌పీఎమ్ వద్ద 15 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్, ముందు 37ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్స్‌తో పాటు డ్యూయల్ డిస్క్ బ్రేకులు (ఏబీఎస్), బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్‌ఈడీ లైటింగ్ వంటి ఆధునిక ఫీచర్లను అందించాయి.