మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ప్రస్తుత సారథి రుతురాజ్ గైక్వాడ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. 2019లో సీఎస్కేలో అడుగుపెట్టిన నాటి నుంచి ధోనీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు. ఎన్ని ట్రోఫీలు, విజయాలు సాధించినా ధోనీలో ఉండే 'నిరాడంబరత' తన జీవితంలో నేర్చుకున్న అతిపెద్ద పాఠమని గైక్వాడ్ కొనియాడాడు.

2019లో ఒక సాధారణ యువ బ్యాటర్‌గా జట్టులోకి వచ్చిన నాటి నుంచి ధోనీని దగ్గరి నుంచి పరిశీలిస్తూ ఎంతో నేర్చుకున్నానని రుతురాజ్ రాసుకొచ్చాడు. ఆటలో సాధించాల్సిన శిఖరాలన్నీ అధిరోహించినప్పటికీ ధోనీ చూపించే వినయం తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపాడు. డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం, మైదానంలో 22 గజాల పిచ్‌పై ధోనీతో కలిసి మ్యాచ్‌లను ముగించడం తనలాంటి క్రికెటర్‌కు ఒక కల సాకారమైన క్షణాలని పేర్కొన్నాడు. 2024 సీజన్‌లో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నప్పటి నుంచి ధోనీపై గౌరవం మరింత పెరిగిందని తెలిపాడు.

మైదానంలో ఆటగాడిగా వీడ్కోలు పలికినప్పటికీ, సీఎస్కే జట్టులో ధోనీ స్థానం ఎప్పటికీ మారబోదని రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. "మీరు ఎప్పటికీ మా 'తలా'.. మా కెప్టెన్, మా లీడర్" అంటూ భావోద్వేగంగా పేర్కొన్నాడు. చివరగా "థ్యాంక్యూ మహి భాయ్ ఫర్ ఎవ్రీథింగ్" అంటూ తన సందేశాన్ని ముగించాడు. 278 మ్యాచ్‌ల్లో 5,439 పరుగులు చేసి, జట్టుకు 5 ఐపీఎల్ ట్రోఫీలు, 2 ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లు అందించిన ధోనీ.. ఆటగాడిగా తప్పుకొన్నా మెంటార్‌గా జట్టుతోనే కొనసాగనున్నాడు. కెప్టెన్సీ మారినా చెన్నైకి అసలైన లీడర్ ధోనీయేనని రుతురాజ్ మాటలు నిరూపిస్తున్నాయి.