ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన క్రికెటర్లలో ఒకడైన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తన ఆటగాడి కెరీర్‌కు ముగింపు పలికాడు. మైదానంలో ఆటగాడిగా అతడి ప్రస్థానం ముగిసినప్పటికీ, లీగ్‌లో అతడు నెలకొల్పిన రికార్డులు, అందించిన విజయాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. చెన్నై జట్టును ఐదుసార్లు విజేతగా నిలపడం దగ్గరి నుంచి కెప్టెన్సీ, వికెట్ కీపింగ్‌లలో అతడు సృష్టించిన రికార్డులు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాయి. ప్లేయర్‌గా తప్పుకున్న ధోనీ, ఐపీఎల్ 2027 సీజన్ నుంచి సీఎస్‌కే జట్టుకు మెంటార్‌గా సరికొత్త బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్నాడు.

2008లో ఐపీఎల్ ఆరంభమైన నాటి నుంచే ధోనీకి సీఎస్‌కేతో బలమైన బంధం ఏర్పడింది. సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌లో ధోనీ మొత్తం 278 మ్యాచ్‌లు ఆడి, 38.30 సగటుతో 137.45 స్ట్రైక్ రేట్‌తో 5,439 పరుగులు సాధించాడు. ఇందులో 24 అర్ధ సెంచరీలు, 264 సిక్సర్లు ఉండగా, వ్యక్తిగత అత్యధిక స్కోరు 84 నాటౌట్. 

ప్రధానంగా మిడిలార్డర్ బ్యాటర్‌గా, ఫినిషర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ధోనీ ఖాతాలో ఐపీఎల్ సెంచరీ లేకపోయినప్పటికీ, ఎన్నో అసాధ్యమైన మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో పరిస్థితులకు తగ్గట్లు సర్దుకుపోతూ ఐదు వేర్వేరు స్థానాల్లో బరిలోకి దిగి అర్ధ సెంచరీలు సాధించడం అతడి బ్యాటింగ్ ప్రత్యేకతకు నిదర్శనం.

కెప్టెన్‌గా ఐపీఎల్‌లో ధోనీ రికార్డులు తిరుగులేనివి. లీగ్ చరిత్రలో ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని విధంగా అత్యధికంగా 235 మ్యాచ్‌లకు సారథ్యం వహించి, 136 విజయాలు నమోదు చేశాడు. కెప్టెన్‌గా బాధ్యతలు మోస్తూనే అత్యధికంగా 218 సిక్సర్లు బాదిన ఘనత కూడా అతడికే దక్కుతుంది. 

ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011, 2018, 2021, 2023లలో ఐదుసార్లు ట్రోఫీలను ముద్దాడింది. తద్వారా ధోనీ.. ఐపీఎల్‌లో అత్యధిక టైటిళ్లు గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) సరసన నిలిచాడు. 

అంతేకాకుండా, సీఎస్‌కేను ఏకంగా 10 సార్లు ఫైనల్స్‌కు చేర్చి లీగ్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిపాడు. రెండేళ్ల నిషేధం తర్వాత 2018లో రీఎంట్రీ ఇచ్చిన తొలి ఏడాదే జట్టును విజేతగా నిలపడం ధోనీ నాయకత్వ ప్రతిభకు నిదర్శనం.

బ్యాటింగ్, నాయకత్వంతో పాటు వికెట్ కీపర్‌గానూ ధోనీ చెరగని ముద్ర వేశాడు. కీపర్‌గా మొత్తం 205 డిస్మిసల్స్‌తో టోర్నీలోనే అగ్రస్థానంలో నిలిచాడు. ఇందులో 158 క్యాచ్‌లు, 47 స్టంపింగ్‌లు ఉన్నాయి. రెప్పపాటు కాలంలో అతడు చేసే మెరుపు స్టంపింగ్‌లు ఐపీఎల్ చరిత్రలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మైదానంలో ప్రశాంతమైన ఆలోచన, అద్భుతమైన వ్యూహాలతో చెన్నై జట్టుకు తిరుగులేని గుర్తింపు తెచ్చిన ధోనీ.. ప్లేయర్‌గా వీడ్కోలు తీసుకున్నా, 2027 సీజన్ నుంచి మెంటార్ పాత్రలో జట్టుకు మార్గనిర్దేశం చేయనున్నాడు.