హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నకిలీ వెండి వర్క్ (సిల్వర్ ఫాయిల్) తయారీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మిఠాయిలు, పాన్, బేకరీ ఉత్పత్తులపై అలంకరణ కోసం వాడే స్వచ్ఛమైన వెండి రేకుల స్థానంలో.. ప్రమాదకరమైన అల్యూమినియం రేకులు, పొడిని తయారు చేస్తున్న నాలుగు అక్రమ తయారీ కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా చార్మినార్, ఫలక్‌నుమా పరిధిలోని యూనిట్లపై దాడులు చేశారు. ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించి నకిలీ వెండి రేకులను తయారు చేస్తున్నందుకు నాలుగు కేసులు నమోదు చేసి, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

భారీగా నకిలీ సరుకు స్వాధీనం:
పోలీసుల తనిఖీల్లో 49 బండిళ్ల నకిలీ అల్యూమినియం సిల్వర్ ఫాయిల్, 10 కేజీల అల్యూమినియం ఫ్లేక్స్, కేకుల అలంకరణకు వాడే 1 కేజీ నకిలీ సిల్వర్ కోటెడ్ షుగర్ బాల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు పెద్ద మొత్తంలో కివామ్, పొగాకు, టాల్కమ్ పౌడర్, ఫ్లేవర్డ్ పాన్ చట్నీ, గ్లూకోజ్, మొక్కజొన్న పిండి, జంతు చర్మపు రేకులు, మిక్సర్లు, ప్యాకింగ్ మెషీన్లు, బరువు తూచే యంత్రాలు తదితర పరికరాలను పోలీసులు సీజ్ చేశారు.

స్వీట్లు, పాన్‌లలో యథేచ్ఛగా వినియోగం:
నిందితులు ఎలాంటి ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) అనుమతులు లేకుండానే ఈ దందాను కొనసాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి అల్యూమినియం ఫ్లేక్స్ తెప్పించి నకిలీ వెండి రేకులుగా మారుస్తున్నారు. వీటిని కాజు కట్లీ, కాజు రోల్స్, చమ్ చమ్ వంటి స్వీట్లతో పాటు మీఠా పాన్‌లలో వాడుతున్నారు. అల్యూమినియం పూత పూసిన షుగర్ బాల్స్‌ను కేకుల తయారీ కోసం బేకరీలకు సరఫరా చేస్తున్నారు. జర్దా, కిమామ్ వంటి సువాసన పాన్ పదార్థాల్లో అల్యూమినియం పొడిని కలుపుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా చిన్న దుకాణాలతో పాటు పలు ప్రముఖ స్వీట్ షాపులకు కూడా వీటిని సరఫరా చేస్తున్నారని, ముఖ్యంగా పండుగల సీజన్‌లో భారీ ఎత్తున విక్రయాలు జరుపుతున్నారని విచారణలో తేలింది.

తీవ్రమైన ఆరోగ్య సమస్యలు:
ఆహారంలో ఉపయోగించడానికి ఏమాత్రం అర్హత లేని అల్యూమినియంను దీర్ఘకాలం తింటే శరీరంలో ఆ లోహం పేరుకుపోయి తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల మూత్రపిండాలు (కిడ్నీలు) దెబ్బతినడం, నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం, ఎముకల బలహీనత, జీర్ణకోశ వ్యాధులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 110 తో పాటు ఆహార భద్రతా చట్టం నిబంధనల కింద కేసులు నమోదు చేశారు.

నకిలీ వర్క్‌ను ఎలా గుర్తించవచ్చంటే:
నకిలీ వెండి రేకులను ప్రాథమికంగా ఎలా గుర్తించవచ్చో పోలీసులు వివరించారు. వెండి రేకును చేతితో రుద్దినప్పుడు అది అతి సూక్ష్మమైన పొడిగా మారిపోతే అది అసలైన వెండి. అదే అల్యూమినియం అయితే చేతితో రుద్దినప్పుడు నలిగిపోవడం, చిరిగిపోవడం లేదా చిన్న ఉండలుగా మారడం జరుగుతుంది. అలాగే డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్‌లో వేస్తే అల్యూమినియం కరిగిపోయి హైడ్రోజన్ వాయువు విడుదలవుతుందని, అసలైన వెండి కరగదని పోలీసులు తెలిపారు. అయితే రసాయన పరీక్షలను ల్యాబ్‌లలో నిపుణులు మాత్రమే చేయాలని వారు స్పష్టం చేశారు.