హైదరాబాద్‌లో ఖరీదైన మద్యం బ్రాండ్ల పేరిట సాగుతున్న భారీ మోసాన్ని ఎక్సైజ్ అధికారులు బట్టబయలు చేశారు. ఖరీదైన మద్యం సీసాలలో చీప్ లిక్కర్ నింపి మార్కెట్లో విక్రయిస్తున్న ముఠా గుట్టును ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ అక్రమ దందాకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ పరిధిలోని శాతరాయికి చెందిన అశోక్ అనే వ్యక్తి గతంలో 'బగ్గా డిస్టిలరీ'లో పనిచేశాడు. అనంతరం క్యాబ్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అయితే మద్యం తయారీ, ప్యాకింగ్‌పై ఉన్న అవగాహనతో సులభంగా డబ్బు సంపాదించవచ్చని భావించాడు. ఇందులో భాగంగా తన ఇంట్లోనే నకిలీ మద్యం దందాను మొదలుపెట్టాడు.

స్థానికంగా ఉండే యాకూబ్ పాషా అనే స్క్రాప్ దుకాణం యజమాని నుంచి ఖరీదైన బ్రాండ్లకు చెందిన ఖాళీ మద్యం సీసాలను సేకరించేవాడు. వాటిని శుభ్రం చేసి, దాదాపు రూ.560 విలువైన "డౌన్ టెన్" అనే చౌకబారు మద్యాన్ని ఆ సీసాలలో నింపేవాడు. ఆపై వాటిని ఖరీదైన ఒరిజినల్ మద్యం బాటిళ్లుగా నమ్మించి కస్టమర్లకు డెలివరీ చేసేవాడు.

ఈ అక్రమ వ్యవహారంపై ఎక్సైజ్ కానిస్టేబుల్ ధనుంజయ్ జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులకు పక్కా సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అశోక్ నివాసంపై ఆకస్మికంగా దాడి చేశారు. ఆ సమయంలో బాటిళ్లలో చౌకబారు మద్యాన్ని నింపుతుండగా నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఘటనా స్థలం నుంచి కల్తీ మద్యంతో నింపిన 10 పూర్తి సీసాలు, అలాగే మరో 30 ఖాళీ ప్రీమియం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఖాళీ సీసాలను సరఫరా చేస్తున్న స్క్రాప్ వ్యాపారి యాకూబ్ పాషాను కూడా ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కల్తీ మద్యాన్ని ఎవరెవరికి విక్రయించారు, ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.