ఆస్ట్రేలియాలో దట్టమైన అడవిలో ఆరు రోజుల క్రితం తప్పిపోయిన ఓ టీనేజర్ ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు. విక్టోరియా రాష్ట్రంలోని మెల్‌బోర్న్‌కు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరు రోజుల ఉత్కంఠ తర్వాత అతను సజీవంగా దొరకడంతో కుటుంబసభ్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. విలియం (17) అనే యువకుడు గత శుక్రవారం తన స్నేహితుడితో కలిసి క్యాంపింగ్ కోసం అడవికి వెళ్లి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో అతని ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. పోలీసు జాగిలాలు, డైవర్లు, హెలికాప్టర్లతో అడవిని జల్లెడ పట్టారు.

చివ‌ర‌కు రెస్క్యూ సిబ్బంది విలియంను గుర్తించారు. హెలికాప్టర్ ద్వారా అతడిని సురక్షితంగా పైకి తీసుకొచ్చి, వెంటనే ఒక డోనట్, వాటర్ బాటిల్ అందించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విలియంకు చిన్నపాటి గీతలు తప్ప ఎలాంటి గాయాలు కాలేదని, ఆరోగ్యంగా ఉన్నాడని అతని తల్లి ఎలిజబెత్ బార్క్లీ తెలిపారు. "అతను ఒకే చోట ఉండి, రెస్క్యూ సిబ్బంది కోసం ఎదురుచూశాడు. నా కొడుకు ప్రాణాలతో తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక వాడిని జీవితంలో ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వను" అని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు.

టీనేజర్‌ను ప్రాణాలతో కనుగొనడం తమకు కూడా చాలా భావోద్వేగానికి గురిచేసిందని, ఇలాంటివి ఎప్పుడూ జరగవని విక్టోరియా పోలీస్ అధికారి జాసన్ బెన్‌బో అన్నారు. అతను అడవిలో ఎలా గడిపాడనే కథను వినడానికి ఆసక్తిగా ఉన్నామని ఆయన తెలిపారు.