హాస్య నటుడు అల్లరి నరేశ్‌ మరోసారి ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఆల్కహాల్‌’ డిసెంబర్‌ 18న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ గురువారం ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా విడుదల తేదీని వెల్లడిస్తూ పోస్టు పెట్టింది.

గతేడాది విడుదలైన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. ఇందులో అల్లరి నరేశ్‌ పాత్ర మద్యానికి పూర్తిగా దూరంగా ఉండే వ్యక్తిగా కనిపిస్తుంది. టీజర్‌లో సత్య, అల్లరి నరేశ్‌ మధ్య జరిగే సంభాషణలు నవ్వులు పూయించాయి. లక్షలు సంపాదిస్తున్నా ఎందుకు మద్యం తాగవని సత్య ప్రశ్నించగా.. సంపాదనకు, మద్యం తాగడానికి సంబంధమేంటని నరేశ్‌ ఎదురు ప్రశ్నిస్తాడు.

తాను మద్యం తాగకపోవడానికి కారణం చెబుతూ.. తాగితే తన నియంత్రణలో తాను ఉండలేనని, మద్యం తనను శాసించడం ఇష్టం లేదని అంటాడు. చివర్లో సత్య మద్యం మానేశానని చెప్పగా.. తన స్నేహితులు తాగుతారని నరేశ్‌ బదులివ్వడం, వారు తాగకపోతే తాగించేలా చేయమని చెప్పడం టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మెహర్‌ తేజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేశ్‌తో పాటు రుహానీ శర్మ, నిహారిక ఎన్‌ఎం, సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గిరీశ్‌ కులకర్ణి, హర్షవర్ధన్‌, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్‌, రఘుబాబు, వెంకటేశ్‌ కాకుమాను, కిరీటి, హరితేజ, సూర్య భగవాన్‌ దాస్‌, ఫ్లోరా జాకబ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సినిమాకు గిబ్రాన్‌ సంగీతం అందిస్తుండగా, నేపథ్య సంగీత బాధ్యతలు చైతన్‌ భరద్వాజ్‌ చేపట్టారు. జిజు సన్నీ కెమెరా, నిరంజన్‌ దేవరమనే ఎడిటింగ్‌ అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తోంది.