ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీశ్‌రావుపై సిద్దిపేట పోలీసులు తాజాగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో హరీశ్‌రావును మొదటి నిందితుడుగా (ఏ1), టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును రెండో నిందితుడిగా (ఏ2) చేర్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి సిద్దిపేటకు బదిలీ చేసి, ఇక్కడ కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం గమనార్హం.

సిద్దిపేటకు చెందిన వ్యాపారవేత్త చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. మరణించిన రైతుల కుటుంబాలకు తాను ఆర్థిక సాయం అందిస్తుండటంతో, తన పట్ల పెరుగుతున్న ప్రజాదరణను చూసి హరీశ్‌రావు కక్ష పెంచుకున్నారని చక్రధర్ గౌడ్ ఆరోపించారు. మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు ద్వారా తనను బెదిరించి, అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కుట్ర పన్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో పాటు తన భార్య ఫోన్లను కూడా ట్యాప్ చేశారని, ఈ విషయాన్ని యాపిల్ సంస్థ పంపిన హెచ్చరిక సందేశాలు ద్వారా గుర్తించానని ఆయన వివరించారు.

ఈ వ్యవహారంపై చక్రధర్ గౌడ్ తొలుత 2024 డిసెంబర్ 1న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ క్రమంలో సుప్రీంకోర్టు వరకు వెళ్లగా, అనంతరం కేసును సిద్దిపేటకు బదిలీ చేసి కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు ఆదేశాల మేరకు సిద్దిపేట పోలీసులు పాత ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలతో పాటు మరిన్ని అదనపు సెక్షన్లను ఈ కేసులో చేర్చారు. ఐపీసీ సెక్షన్లు 120బీ, 386, 409, 506, 419, 420, 467, 406 రెడ్ విత్ 34తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66డీ కింద హరీశ్‌రావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.