సోషల్‌ మీడియాలో కొత్త పదాలు పుట్టుకొస్తున్నాయి. కొన్ని సరదా మాటలుగా మొదలై.. ఆ తర్వాత రోజువారీ సంభాషణల్లో భాగమవుతున్నాయి. అలాంటి ఓ పదమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే ‘మ్యాక్సింగ్‌’ (Maxxing). 2026 సంవత్సరానికి గానూ డిక్షనరీ.కామ్‌ ఈ పదాన్ని ‘వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఎంపిక చేసింది. అందం నుంచి ఆరోగ్యం వరకు, నిద్ర నుంచి పని వరకు.. ప్రతి విషయంలోనూ సాధ్యమైనంత మెరుగైన ఫలితాలు సాధించాలనే ఆలోచనను ఈ పదం ప్రతిబింబిస్తోంది.

అసలు మ్యాక్సింగ్‌ అంటే ఏంటి?
‘మ్యాక్సింగ్‌’ అనే పదం ‘మ్యాక్సిమైజింగ్‌’ నుంచి వచ్చింది. అంటే ఒక పనిని లేదా జీవితంలోని ఓ అంశాన్ని సాధ్యమైనంత మెరుగుపరచుకోవడం. ఏదైనా విషయంలో అత్యుత్తమ స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నించడాన్ని ఈ పదంతో సూచిస్తున్నారు. మొదట గేమింగ్‌ ప్రపంచంలో వినిపించిన ఈ పదం.. ఇప్పుడు సోషల్‌ మీడియా ద్వారా విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

ఉదాహరణకు, తమ రూపాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చుకోవడానికి ప్రయత్నించడాన్ని ‘లుక్స్‌ మ్యాక్సింగ్‌’ అంటారు. మంచి నిద్ర కోసం ప్రత్యేక అలవాట్లు పాటించడాన్ని ‘స్లీప్‌ మ్యాక్సింగ్‌’ అని, వ్యాయామం ద్వారా శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడాన్ని ‘జిమ్‌ మ్యాక్సింగ్‌’ అని పిలుస్తున్నారు. ఉద్యోగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను వీలైనంత ఎక్కువగా ఉపయోగించడాన్ని ‘టోకెన్‌ మ్యాక్సింగ్‌’ అంటున్నారు. ఇలా ఏ అంశానికి సంబంధించిన పదానికైనా ‘మ్యాక్సింగ్‌’ను జోడించి కొత్త పదాలు సృష్టిస్తున్నారు. 

గేమింగ్‌ నుంచి సోషల్‌ మీడియా వరకు..
ఈ పదం వెనుక గేమింగ్‌ ప్రపంచంతో సంబంధం ఉంది. వీడియో గేమ్‌లలో ఓ పాత్ర బలాలను పెంచి, బలహీనతలను తగ్గించడం ద్వారా విజయావకాశాలను మెరుగుపరుచుకునే వ్యూహాన్ని ‘మిన్‌-మ్యాక్సింగ్‌’ అంటారు. అక్కడి నుంచి ‘మ్యాక్సింగ్‌’ అనే వాడుక ఇతర రంగాలకూ విస్తరించింది. ముఖ్యంగా ‘లుక్స్‌ మ్యాక్సింగ్‌’ ద్వారా ఈ పదం ఆన్‌లైన్‌ చర్చల్లో బాగా ప్రాచుర్యం పొందింది. 2026లో ఈ పదం ఒక్క రూపానికే పరిమితం కాకుండా ఆరోగ్యం, ఉద్యోగం, జీవనశైలి, వినోదం వంటి అనేక రంగాల్లో వినిపిస్తోంది. 

ప్రతి విషయంలోనూ మెరుగుదలే లక్ష్యమా?
మ్యాక్సింగ్‌ వెనుక ఉన్న ఆలోచన స్వీయాభివృద్ధి. అయితే ప్రతి విషయాన్నీ మరింత మెరుగుపరచుకోవాలనే ఒత్తిడి కూడా దీనితో పెరుగుతోంది. సోషల్‌ మీడియాలో కనిపించే ఆదర్శ రూపాలు, జీవనశైలి చూసి తమను తాము ఇతరులతో పోల్చుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుకే ఈ పదాన్ని కొందరు వ్యక్తిగత అభివృద్ధికి చిహ్నంగా చూస్తుంటే, మరికొందరు ప్రతిదాన్నీ అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లాలనే మోజుపై వ్యంగ్యంగా ఉపయోగిస్తున్నారు.

గత ఏడాది డిక్షనరీ.కామ్‌ ‘67’ అనే వైరల్‌ పదాన్ని ఎంపిక చేసింది. ఈసారి ‘మ్యాక్సింగ్‌’ ఎంపిక కావడం ద్వారా ఇంటర్నెట్‌ సంస్కృతి, యువత వాడే భాష.. రోజువారీ ఇంగ్లిష్‌పై ఎంత ప్రభావం చూపుతున్నాయో మరోసారి స్పష్టమవుతోంది.