అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో కూటమి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దశాబ్దాలుగా కాంగ్రెస్‌, ఆ తర్వాత వైసీపీకి బలమైన పట్టున్న ఈ మండలంలో తొలిసారిగా కూటమి అభ్యర్థులు ఆధిపత్యం చాటుకున్నారు. మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు గానూ 15 చోట్ల విజయం సాధించారు. ఇందులో టీడీపీ 14 స్థానాలను కైవసం చేసుకోగా.. జనసేన ఒక స్థానంలో గెలుపొందింది. స్థానిక ఎన్నికల చరిత్రలో తొలిసారిగా మండల పరిషత్‌పై కూటమి పట్టు సాధించడంతో భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.