భార్యను హత్య చేసిన ఓ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌) కానిస్టేబుల్‌.. మృతదేహాన్ని మూటలో కట్టి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి గోదావరిలో పడేశాడు. ఈ ఘటనలో అతడికి తండ్రి కూడా సహకరించాడు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నదిలో గాలింపు చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. నిందితుడి తండ్రిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉంది.

కొత్తగూడెం త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ బి. రోహిత్‌రాజు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెం పట్టణంలోని గొల్లగూడెంలో అద్దె ఇంట్లో నివసిస్తున్న బోడా నరేందర్‌ (ఏఆర్‌పీసీ-623) నవంబర్‌ 3 రాత్రి భార్య భవానీ (29)ని గొంతు నులిమి హత్య చేశాడు. చేతులతోపాటు స్కార్ఫ్‌ ఉపయోగించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

అనంతరం మృతదేహాన్ని గోళియా తండాలోని తన స్వగ్రామానికి తీసుకెళ్లాడు. తండ్రి బోడా హరిలాల్‌ సాయంతో వ్యవసాయ పొలంలో దాచిపెట్టాడు. నవంబర్‌ 4 రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరూ కలిసి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై భద్రాచలానికి తీసుకెళ్లారు. జాతీయ రహదారి-30 మీదుగా సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించి గోదావరి వంతెన వద్దకు చేరుకున్నారు. అక్కడ మృతదేహాన్ని నదిలో పడేసి ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించారు.

భవానీ కనిపించడం లేదంటూ ఆమె సోదరి గుండారపు స్వరూప నవంబర్‌ 6న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదైంది. అదే రోజు నరేందర్‌ పోలీసులను సంప్రదించి భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు గోదావరిలో గాలింపు చేపట్టి శుక్రవారం రాత్రి భవానీ మృతదేహాన్ని గుర్తించారు. దాన్ని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. నరేందర్‌ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ తెలిపారు. అతడి తండ్రి హరిలాల్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

భవానీ, నరేందర్‌కు మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. కొంతకాలం సహజీవనం చేసిన వీరు 2025 ఏప్రిల్‌లో భద్రాద్రి ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే భవానీని పెళ్లి చేసుకోవడాన్ని నరేందర్‌ కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని సమాచారం.