దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు తీపి కబురు అందించింది. రూ.3 కోట్లలోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (ఎఫ్‌డీ) ఎంపిక చేసిన కాలపరిమితులకు వడ్డీ రేట్లను పెంచింది. గరిష్ఠంగా 50 బేసిస్‌ పాయింట్ల మేర పెంపు చేపట్టింది. సవరించిన రేట్లు నవంబర్‌ 4 నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా నిర్ణయంతో సాధారణ ఖాతాదారులకు గరిష్ఠంగా 6.60 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7.20 శాతం వడ్డీ లభించనుంది.

సాధారణ ఖాతాదారులకు 61 రోజుల నుంచి ఆరు నెలల కాలపరిమితి డిపాజిట్లపై వడ్డీని 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 4.75 శాతానికి చేర్చింది. ఆరు నెలల ఒక రోజు నుంచి తొమ్మిది నెలలలోపు డిపాజిట్లపై 15 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.65 శాతంగా నిర్ణయించింది. తొమ్మిది నెలల ఒక రోజు నుంచి ఏడాదిలోపు డిపాజిట్లపై వడ్డీని 5.75 శాతం నుంచి 5.90 శాతానికి పెంచింది.

దీర్ఘకాలిక డిపాజిట్లపైనా బ్యాంకు రేట్లను సవరించింది. 18 నెలల ఒక రోజు నుంచి రెండేళ్లలోపు డిపాజిట్లపై 6.45 శాతంగా ఉన్న వడ్డీని 6.50 శాతానికి పెంచింది. రెండేళ్ల ఒక రోజు నుంచి మూడేళ్లలోపు డిపాజిట్లపై 6.45 శాతం నుంచి 6.55 శాతానికి చేర్చింది. మూడేళ్ల ఒక రోజు నుంచి ఐదేళ్లలోపు డిపాజిట్లపై 6.60 శాతం వడ్డీ అందించనుంది. ఐదేళ్ల ఒక రోజు నుంచి పదేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై అత్యధికంగా 45 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీ రేటు 6.15 శాతం నుంచి 6.60 శాతానికి చేరింది.

సీనియర్‌ సిటిజన్లకు 61 రోజుల నుంచి ఆరు నెలలలోపు డిపాజిట్లపై వడ్డీని 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.25 శాతంగా నిర్ణయించింది. మూడేళ్ల ఒక రోజు నుంచి ఐదేళ్లలోపు డిపాజిట్లపై అత్యధికంగా 7.20 శాతం వడ్డీ లభించనుంది. ఐదేళ్ల ఒక రోజు నుంచి పదేళ్లలోపు డిపాజిట్లపై రేటును 6.65 శాతం నుంచి 7.10 శాతానికి పెంచింది.

ఇటీవలి నెలల్లో ఐసీఐసీఐ బ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, కోటక్‌ మహీంద్రా బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు కూడా ఎంపిక చేసిన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించాయి. దీంతో డిపాజిట్‌దారులు వివిధ బ్యాంకులు అందిస్తున్న రేట్లను పోల్చి చూసుకుని పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం మంచిది.