ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల కల్లా తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని స్పష్టం చేశారు.

మొత్తం ప్రక్రియను సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని, ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులను తెరిచామని వివరించారు. ఓట్ల లెక్కింపు చాలా బాగా జరుగుతోందని ఏజెంట్లు సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ను 60 రోజుల పాటు భద్రపరుస్తామని, ఏవైనా కోర్టు కేసులు ఉంటే మరింత ఎక్కువ కాలం భద్రపరుస్తామని తెలిపారు.

పల్నాడు జిల్లా కంకణాలపల్లి గ్రామస్థులు తమకు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్దని, ఫ్లైఓవర్ వేయాలని కోరుతూ బ్యాలెట్ బాక్సులో కరపత్రాలు వేశారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా... అది స్థానిక జిల్లా యంత్రాంగం పరిధిలోని అంశమని సమాధానమిచ్చారు. అలాగే, రిగ్గింగ్ జరిగిందని జిల్లా కలెక్టర్ నివేదిక ఇస్తేనే రీపోలింగ్ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని పునేఠా స్పష్టం చేశారు. పరిషత్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే, త్వరలోనే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.