అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా సైన్యం భారత భూభాగంలోకి దాదాపు 50 కిలోమీటర్లు చొచ్చుకొచ్చిందని, భారత సైన్యాన్ని ఓడించి కొన్ని ప్రాంతాలను తన అధీనంలోకి తీసుకుందని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని భారత సైన్యం ఖండించింది. ఈ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. పాకిస్థాన్‌ ప్రాయోజితంగా అనుమానిస్తున్న కొన్ని ఖాతాలు సమన్వయంతో ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని వెల్లడించింది.

‘కోఆర్డినేటెడ్‌ ఇనఅథెంటిక్‌ బిహేవియర్‌ ఎక్స్‌పోజ్డ్‌’ పేరుతో సైన్యం తన ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం ద్వారా ఈ వ్యవహారాన్ని బయటపెట్టింది. నవంబర్‌ 6వ తేదీ మధ్యాహ్నం 3.06 గంటల నుంచి నవంబర్‌ 7వ తేదీ తెల్లవారుజామున 1.46 గంటల మధ్య ఆరు ఎక్స్‌ ఖాతాలు ఒకే తరహా సమాచారాన్ని పోస్టు చేసినట్లు గుర్తించింది. చైనా సైన్యం 50 కిలోమీటర్లు చొచ్చుకొచ్చిందని, భారత భూభాగాన్ని ఆక్రమించిందని ఆ పోస్టుల్లో పేర్కొన్నట్లు తెలిపింది.

ఈ ప్రచారంలో అడవులు, రాతి ప్రాంతాల్లో సైనికులు కదులుతున్న వీడియోలను కూడా ఉపయోగించారు. అయితే వాటికి అరుణాచల్‌ సరిహద్దు పరిస్థితులతో సంబంధం లేదని సైన్యం స్పష్టం చేసింది. గతంలోనూ పాత వీడియోలు, ఇతర దేశాల సైనిక విన్యాసాల దృశ్యాలు, మార్పులు చేసిన వీడియోలను చైనా చొరబాటుగా చిత్రీకరిస్తూ ప్రచారం చేసిన ఘటనలను గుర్తుచేసింది.

భారత సైన్యంపై ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీయడం, సరిహద్దు పరిస్థితులపై తప్పుడు అభిప్రాయాలు కల్పించడం ఈ ప్రచారం వెనుక ఉద్దేశమని సైన్యం పేర్కొంది. సరిహద్దులకు సంబంధించిన వార్తలను ఇతరులకు పంపించే ముందు అధికారిక ప్రకటనలు, విశ్వసనీయ వనరుల ద్వారా నిజానిజాలు నిర్ధారించుకోవాలని ప్రజలకు సూచించింది.